4 కంటైనర్లు- 2వేల కోట్లు.. ఎవరివంటే..!
మనీ కంటైనర్లు ఎక్కడ నుంచి వస్తున్నాయి? ఎక్కడకు వెళ్తున్నాయి? అంత డబ్బు ఎవరిది? సెక్యూరిటీ లేకుండా అంత డబ్బు ఎలా తీసుకెళ్తున్నారు?. ఇలా అనేక ప్రశ్నలు వ్యక్తమయ్యాయి.
ఏపీలో కంటైనర్లలో కరెన్సీ నోట్ల కట్టలు కలకలం రేపాయి. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా రెండువేల కోట్ల రూపాయలు పోలీసుల తనిఖీల్లో బయటపడ్డాయి. కంటైనర్లలోని నోట్ల కట్టలను చూసి అంతా నోళ్లు అవాక్కయ్యారు. ఎన్నికల సమయం కావడంతో అనంతపురం జిల్లా పామిడి వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో అటువైపుగా నాలుగు కంటైనర్లు వచ్చాయి. వాటిపై పోలీస్ అనే స్టిక్కర్ కూడా ఉంది. వాటిని పక్కకు ఆపి తనిఖీలు చేశారు. కంటైనర్లు ఓపెన్ చేయగానే అందులోని బాక్సులు చూసి షాకయ్యారు. ఒక్కో కంటైనర్లలో 500 కోట్ల రూపాయల కట్టలు ఉన్నాయి. దాదాపు రెండు వేల కోట్ల రూపాయల వరకు ఉన్నట్లు అంచనా వేశారు.
మనీ కంటైనర్లు ఎవరివి..?
మనీ కంటైనర్లు ఎక్కడ నుంచి వస్తున్నాయి? ఎక్కడకు వెళ్తున్నాయి? అంత డబ్బు ఎవరిది? సెక్యూరిటీ లేకుండా అంత డబ్బు ఎలా తీసుకెళ్తున్నారు?. ఒకవేళ ప్రభుత్వానికి సంబంధించిన డబ్బు అనుకున్నా దానికి సెక్యూరిటీ అవసరం లేదా?. ఇలా అనేక ప్రశ్నలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో కంటైనర్‌లో ఉన్న సిబ్బంది పోలీసులకు కీలక డాక్యుమెంట్లు చూపించారు. ఆ డబ్బంతా RBIకి చెందిందని పత్రాలు చూపించారు. కొచ్చి నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు తెలిపారు. రికార్డులన్నీ పరిశీలించిన పోలీసులు RBI డబ్బని నిర్ధారించుకున్న తర్వాత వాటిని పంపించేశారు. అయితే అన్నివేల కోట్లను కనీసం సెక్యూరిటీ లేకుండా తరలించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మొన్న కూడా ఇలానే..
ఎన్నికలు కావడంతో పోలీసులు ఎక్కడికక్కడ విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. 3రోజులు కిందటే అనంతపురం జిల్లాలో 2 కోట్ల రూపాయలను అధికారులు సీజ్ చేశారు. తాజాగా కంటైనర్లలో అన్నివేల కోట్లు ఉండటంతో ఇది కూడా ఎన్నికలకు సంబంధించిందేనేమో అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కానీ RBIకి చెందిన డబ్బని పక్కా ఆధారాలు చూపించడంతో కథ సుఖాంతమైంది.