Telugu Global
Andhra Pradesh

జగన్ పై దాడి కేసులో నిందితుడిని కస్టడీకి కోరిన పోలీసులు

రాయి విసిరింది సతీష్ అని తేలిపోయింది. దానికి ప్రేరేపించింది ఎవరు, నిందితుడికి డబ్బులు ఎర చూపారా..? అనే అంశాలపై మాత్రం పోలీసులు స్పష్టత ఇవ్వలేదు.

జగన్ పై దాడి కేసులో నిందితుడిని కస్టడీకి కోరిన పోలీసులు
X

సీఎం జగన్ పై జరిగిన దాడి కేసులో ఏ-1 గా ఉన్న సతీష్ ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నారు. ఈ కేసు విచారణలో మరిన్ని విషయాలు రాబట్టేందుకు సతీష్ ని తమ కస్టడీకి అనుమతించాల్సిందిగా పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ పై వెంటనే కోర్టు నిర్ణయం ప్రకటించలేదు. విచారణను నేటికి(మంగళవారం) వాయిదా వేసింది.

దాడి జరిగింది ముఖ్యమంత్రిపై కావడం, ఈ ఘటనలో కుట్రకోణాన్ని వెలికితీయాల్సి ఉండటంతో, నిందితుడిని ఏడు రోజులు కస్టడీకి అనుమతివ్వాలని కోరారు పోలీసులు. ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి కమ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో కస్టడీ కోసం పిటిషన్ వేశారు. దీనిపై ఈరోజు విచారణ జరగాల్సి ఉంది. ఇక నిందితుడి వాంగ్మూలాన్ని నమోదు చేయడానికి కూడా పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కౌంటర్‌ దాఖలు చేసేందుకు నిందితుడి తరపు న్యాయవాది సమయం కోరారు. ఈ పిటిషన్ పై విచారణ ఈనెల 29కి వాయిదా పడింది.

ఏ-2పై సందిగ్ధం..

రాయి విసిరింది సతీష్ అని తేలిపోయింది. దానికి ప్రేరేపించింది ఎవరు, నిందితుడికి డబ్బులు ఎర చూపారా..? అనే అంశాలపై మాత్రం పోలీసులు స్పష్టత ఇవ్వలేదు. మరికొందరిని విచారణకోసం పిలిపించినా ఫలితం లేదు. ఈ కేసులో టీడీపీ నేతల ప్రమేయం ఉందంటున్నారు కానీ, దానిపై కూడా ఇంకా స్పష్టత లేదు. సతీష్ ని మరింత లోతుగా విచారించి మిగతా విషయాలు రాబట్టాల్సి ఉంది. అందుకే అతడిని పోలీసులు కస్టడీలోకి తీసుకోవాలనుకుంటున్నారు. కస్టడీ పిటిషన్ పై ఈరోజు కోర్టు ఉత్తర్వులు ఇస్తుంది.

First Published:  23 April 2024 7:15 AM IST
Next Story