Telugu Global
Andhra Pradesh

నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలపై కేసులు.. లేటెస్ట్ ఎంట్రీ కొడాలి నాని

నెలరోజుల వ్యవధిలో ఏకంగా నలుగురు మాజీ ఎమ్మెల్యేలపై కేసులు నమోదు కావడం, అందులో ఇద్దరు ఆల్రడీ జైలుకిపోవడం సంచలనంగా మారింది.

నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలపై కేసులు.. లేటెస్ట్ ఎంట్రీ కొడాలి నాని
X

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ కారణాలతో వైసీపీ ఎమ్మెల్యేలపై కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానిపై కేసు నమోదైంది. తన తల్లి మరణానికి ఏపీ బెవరేజెస్‌ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని కారణం అంటూ గుడివాడ రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో దుగ్గిరాల ప్రభాకర్‌ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. తమ గోడౌన్లలో ఉన్న లిక్కర్‌ కేసులను ధ్వంసం చేశారని, వాటిని తగలబెట్టారని పేర్కొన్నారు. తన కుటుంబ సభ్యుల్ని కూడా దూషించారని, ఆ కారణంతోనే తన తల్లి మరణించిందని ప్రభాకర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో కొడాలి నాని సహా మరికొందరిపై కేసు నమోదైంది..

నాలోగు వికెట్..

కూటమి అధికారంలోకి వచ్చాక కేసులు ఎదుర్కొన్న వారిలో కొడాలి నాని నాలుగో మాజీ ఎమ్మెల్యే. ఎన్నికల సమయంలో నమోదైన కేసులో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఆయనను ఇటీవలే జగన్ నెల్లూరు జిల్లా జైలులో పరామర్శించారు. ఆ తర్వాత కోడూమూరు మాజీ ఎమ్మెల్యే సుధాకర్ పై కూడా కేసు నమోదైంది. తన ఇంట్లో పనిచేసే బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన కేసులో సుధాకర్ ని అరెస్ట్ చేశారు. ఇక కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ పై ఇటీవలే కేసు నమోదైంది. రేషన్ బియ్యం విషయంలో ఆయన అక్రమాలు చేశారంటూ ఆరోపణలున్నాయి. అయితే కేసు మాత్రం ఆక్రమణలు తొలగిస్తుంటే అడ్డుకున్నారనే కారణంతో నమోదైంది. తన అనుచరుడి బిల్డింగ్ ని పడగొడుతున్న క్రమంలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి అక్కడ హడావిడి చేశారు. దీంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఇప్పుడు కొడాలి నానిపై కేసు నమోదు కావడం తాజా అప్ డేట్.

కూటమి అధికారంలోకి వచ్చాక రాజకీయ కక్షసాధింపులు మొదలయ్యాయంటూ ఆల్రడీ ఆరోపణలు వినపడుతున్నాయి. మరోవైపు చట్టం తన పని తాను చేసుకుపోతోందంటూ అధికార పార్టీ అంటోంది. నెలరోజుల వ్యవధిలో ఏకంగా నలుగురు మాజీ ఎమ్మెల్యేలపై కేసులు నమోదు కావడం, అందులో ఇద్దరు ఆల్రడీ జైలుకిపోవడం మాత్రం సంచలనంగా మారింది.

First Published:  6 July 2024 7:24 AM GMT
Next Story