Telugu Global
Andhra Pradesh

టీటీడీపై ఆరోపణలు.. టీడీపీ ఎమ్మెల్సీపై కేసు..

కాషన్ డిపాజిట్ కచ్చితంగా మూడు రోజుల లోపు డిపాజిట్ అవుతున్నా కావాలనే టీటీడీపై దుష్ప్రచారం మొదలు పెట్టారని అంటున్నారు అధికారులు. అందుకే పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు.

టీటీడీపై ఆరోపణలు.. టీడీపీ ఎమ్మెల్సీపై కేసు..
X

కాషన్ డిపాజిట్ వ్యవహారంలో టీటీడీపై ఆరోపణలు చేసిన ఎమ్మెల్సీ బీటెక్ రవిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు టీటీడీ అధికారులు. భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా టీటీడీపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ తిరుమల టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అవాస్తవాలు ప్రచారం చేస్తున్న బీటెక్ రవిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

అసలేంటీ ఆరోపణ..?

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు, గదులు బుక్ చేసుకునే సమయంలో కాషన్ డిపాజిట్ చెల్లిస్తారు. వారు తిరిగి వెళ్లే సమయంలో గదుల్ని ఖాళీ చేసిన తర్వాత అద్దె మినహా కాషన్ డిపాజిట్ ను టీటీడీ రీఫండ్‌ చేస్తుంది. అయితే ఇక్కడ కాషన్ డిపాజిట్ బ్యాంక్ లావాదేవీల కారణంగా కాస్త ఆలస్యంగా భక్తుల అకౌంట్లలో జమ అవుతోంది. ఉద్దేశపూర్వకంగానే ఇలా ఆలస్యం చేస్తున్నారని, ఆలోపు కాష‌న్ డిపాజిట్ సొమ్మును రాష్ట్ర ప్ర‌భుత్వం వినియోగించుకుంటోంద‌ని టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి టీటీడీపై ఆరోపణలు చేశారు. దీంతో ఈ వ్యవహారం సంచలనంగా మారింది.

ఇది పూర్తిగా నిరాధారమైన ఆరోపణ అని టీటీడీ వివరణ ఇస్తోంది. కాషన్ డిపాజిట్ ఎలిజిబిలిటి స్టేట్‌మెంట్‌ అదేరోజు ఫెడరల్‌ బ్యాంకు లేదా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కి చేరుతుందని, ఈ బ్యాంకుల అధికారులు అదే రోజు అర్ధరాత్రి 12 గంటల్లోపు సంబంధిత మర్చంట్‌ సర్వీసెస్‌ కు పంపుతారని, అక్కడినుంచి మరుసటి రోజు కస్టమర్‌ బ్యాంకు అకౌంట్‌ కు నగదు బదిలీ అవుతుందని చెబుతున్నారు అధికారులు. రిజర్వ్ బ్యాంక్ నిబంధనల ప్రకారం 7 పనిదినాల్లో కాషన్ డిపాజిట్ రీఫండ్ చేయాల్సి ఉంటుంది. నిబంధనలు ఇంత స్పష్టంగా ఉన్నా.. కాషన్ డిపాజిట్ కచ్చితంగా మూడు రోజుల లోపు డిపాజిట్ అవుతున్నా కావాలనే టీటీడీపై దుష్ప్రచారం మొదలు పెట్టారని అంటున్నారు అధికారులు. అందుకే పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు.

First Published:  30 Aug 2022 8:19 AM IST
Next Story