సీఎం జగన్ పై దాడి.. స్పందించిన మోడీ
ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదని, సీఎం జగన్ పై దాడికి పాల్పడ్డ వారిపై ఎలక్షన్ కమిషన్ కఠిన చర్యలు తీసుకోవాలని కేటీఆర్ కోరారు. అలాగే జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయవాడలో బస్సు యాత్ర నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి జగన్ పై నిన్న రాత్రి గుర్తుతెలియని వ్యక్తి రాయితో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో సీఎం జగన్ ఎడమ కంటి కనుబొమ్మపై తీవ్ర గాయం అయ్యింది. వెంటనే సీఎం జగన్ విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నారు. గాయానికి రెండు కుట్లు వేసినట్లు వైద్యులు తెలిపారు.
జగన్ పై దాడి జరగడంపై ఇతర రాష్ట్ర రాజకీయ ప్రముఖులు, ప్రధానమంత్రి మోడీ కూడా స్పందించారు. ఈ మేరకు ప్రధాని ఓ ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి జగన్ త్వరగా కోలుకోవాలని దేవున్ని ప్రార్థిస్తున్నట్లు ఆ ట్వీట్ లో ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్ పై దాడి జరగడాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఖండించారు. రాజకీయ విభేదాలు ఎప్పుడూ హింసాత్మకంగా మారకూడదని, ప్రజాస్వామ్యంలో సభ్యత, గౌరవాన్ని పరస్పరం కాపాడుకోవాలని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సూచించారు. జగన్ త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదని, సీఎం జగన్ పై దాడికి పాల్పడ్డ వారిపై ఎలక్షన్ కమిషన్ కఠిన చర్యలు తీసుకోవాలని కేటీఆర్ కోరారు. అలాగే జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. ఇక తన సోదరుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ పై దాడి జరగడంపై వైఎస్ షర్మిల స్పందిస్తూ.. సీఎం జగన్ పై దాడి జరగడం బాధాకరం, దురదృష్టకరమని అన్నారు. ఇది ప్రమాదవశాత్తు జరిగినట్లు భావిస్తున్నట్లు చెప్పారు. అలాకాకుండా ఎవరైనా కావాలని దాడి చేసి ఉంటే ప్రతి ఒక్కరూ కచ్చితంగా ఖండించాల్సిందేనని అన్నారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదని షర్మిల అభిప్రాయపడ్డారు. సీఎం జగన్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.