Telugu Global
Andhra Pradesh

అమరావతిలో నేడే ప్లాట్ల పండగ..

సీఆర్డీఏ పరిధిలో 50,793 మంది మహిళలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం జగన్‌ ఈరోజు ప్రారంభిస్తారు. 11 గ్రామాల్లోని 25 లే అవుట్‌ లలో 2000 లీటర్ల పాలతో సీఎం జగన్‌, వైఎస్ఆర్ చిత్రపటాలకు లబ్ధిదారులు పాలాభిషేకాలు చేశారు.

అమరావతిలో నేడే ప్లాట్ల పండగ..
X

అమరావతిలో ఈరోజు ప్లాట్ల పండగ. సీఎం జగన్, పేద ప్రజలకు అమరావతిలోని ఆర్-5 జోన్ లో ప్లాట్ల పట్టాలు అందిస్తారు. సీఆర్డీఏ ప్రాంతంలో నిర్మించిన టిడ్కో గృహాలను కూడా లబ్ధిదారులకు అందిస్తారు. సెంటు భూమి అంటూ విపక్షాలు రాద్ధాంతం చేస్తున్న వేళ, మా కష్టార్జితాన్ని వారికి ఎలా కట్టబెడతారంటూ అమరావతి రైతులు ఆందోళనలు చేస్తున్న వేళ.. ఏపీ ప్రభుత్వం పట్టాల పంపిణీ మొదలు పెడుతోంది.

సీఆర్డీఏ పరిధిలో 50,793 మంది మహిళలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం జగన్‌ ఈరోజు ప్రారంభిస్తారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటపాలెంలో జరిగే ఈ కార్యక్రమంలో సీఎం జగన్ సహా మంత్రులు, స్థానిక నేతలు పాల్గొంటారు. ఇప్పటికే అక్కడ ఏర్పాట్లు పూర్తయ్యాయి. లేఅవుట్లు పూర్తి చేసి ఇళ్లపట్టాలు రెడీ చేశారు.

గుంటూరు జిల్లాకు చెందిన 23,762 మందికి, ఎన్టీఆర్‌ జిల్లాకు చెందిన 27,031 మందికి పట్టాలు పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. లభ్దిదారుల పేర్లతో పట్టాలు రూపొందించారు. వారికి సీఎం జగన్ చేతులమీదుగా లాంఛనంగా పట్టాలు అందించే కార్యక్రమం మొదలు పెడతారు. ఇందుకోసం సీఆర్డీఏ పరిధిలోని 1,402 ఎకరాల్లో 25 లేఅవుట్లు వేశారు. ఇళ్ల పట్టాల పంపిణీతో పాటు, సీఆర్డీఏ ప్రాంతంలో రూ.443.71 కోట్లతో నిర్మించిన 5,024 టిడ్కో గృహాలను కూడా ఈరోజే లబ్ధిదారులకు అందించే ప్రణాళిక సిద్ధం చేశారు.

పాలాభిషేకాలు..

అమరావతిలో నిరుపేదలకు పట్టాలు పంపిణీ చేస్తున్న నేపథ్యంలో లబ్ధిదారులతో అక్కడ పండగ వాతావరణం నెలకొంది. లబ్ధిదారులతో కలసి వైసీపీ నాయకులు ఆ ప్రాంతాల్లో భారీ ర్యాలీ చేపట్టారు. 11 గ్రామాల్లోని 25 లే అవుట్‌ లలో 2000 లీటర్ల పాలతో సీఎం జగన్‌, వైఎస్ఆర్ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేశారు. ప్లాట్లలో కూడా పాలను చిలకరించారు.

First Published:  26 May 2023 6:27 AM IST
Next Story