పిఠాపురం గొడవ శాంపిల్ మాత్రమేనా?
రెండు పార్టీల నేతలు ఒకరిపై మరొకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకోవటంతో మొదలైన గొడవ చివరకు కుర్చీలతో కొట్టుకునేదాకా చేరుకుంది.
తెలుగులో ‘కాపురం చేసే కళ కాలు తొక్కిన నాడే తెలిసింది’ అనే సామెత చాలా పాపులర్. అలాగే ఉంది టీడీపీ-జనసేన పార్టీ సమన్వయ సమావేశాల తీరు. తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గ సమన్వయ సమావేశంలో పెద్ద గొడవైంది. రెండు పార్టీల నేతలు ఒకరిపై మరొకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకోవటంతో మొదలైన గొడవ చివరకు కుర్చీలతో కొట్టుకునేదాకా చేరుకుంది. రెండు పార్టీల మధ్య ఇలాంటి గొడవలు అవతాయని అందరు మొదటి నుంచి అనుమానిస్తున్నదే.
రెండు పార్టీల మధ్య పొత్తుకు చాలా సమస్యలున్నాయి. చంద్రబాబు - పవన్ కల్యాణ్ మధ్య సమన్వయం కుదిరితే సరిపోదు అది కిందస్థాయి కార్యకర్త దాకా ఉండాలి. అప్పుడే రెండు పార్టీలు అరమరికలు లేకుండా ముందుకు సాగుతాయి. అయితే ఇక్కడ సమస్య ఏమిటంటే చాలా నియోజకవర్గాల్లో పోటీకి రెండు పార్టీల నేతలు రెడీ అవుతున్నారు. ఇంతకాలం కష్టపడిన తాము పోటీచేసే అవకాశాన్ని ఎదుటి పార్టీకి ఇచ్చేయాలంటే ఇష్టపడటంలేదు. రెండు పార్టీలు పోటీకి రెడీ అవుతున్న నియోజకవర్గాలు దాదాపు 40 దాకా ఉన్నాయి.
పిఠాపురం, కాకినాడ, రాజమండ్రి, పీ గన్నవరం, ప్రత్తిపాడు, నరసాపురం, ఏలూరు, భీమిలి, విశాఖ ఉత్తరం, పెందుర్తి, గాజువాక, అనకాపల్లి, చిత్తూరు, తిరుపతి, రాజంపేట, అనంతపురం, రైల్వేకోడూరు, శ్రీకాళహస్తి, పుట్టపర్తి లాంటి నియోజకవర్గాలు ఇంకా ఉన్నాయి. ఇలాంటి నియోజకవర్గాల్లో సమన్వయం అంత తేలికకాదు. ఇపుడు పిఠాపురంలో జరిగిందిదే. రాబోయే ఎన్నికల్లో కలిసి పోటీ చేసి గెలుచుకునే విషయాన్ని వదిలేసి ఒకరిని మరొకరు దెప్పిపొడుచుకున్నారు. దాంతో రెండు వైపుల కార్యకర్తలు రెచ్చిపోయి కుర్చీలతో కొట్టేసుకున్నారు.
తాను నియోజకవర్గాన్ని రూ. 2800 కోట్లతో అభివృద్ధి చేశానని టీడీపీ ఇన్‌చార్జి వర్మ చెప్పారు. తర్వాత జనసేన ఇన్‌చార్జి ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. నిజంగానే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుంటే ఎందుకు ఓడిపోయారని నిలదీశారు. రాబోయే ఎన్నికల్లో జనసేన గెలుపుకు టీడీపీ సాయం చేయాలని కోరారు. దాంతో వర్మ మాట్లాడుతూ.. ఓడిపోయింది తానొక్కడినే కాదని మహామహులు అనుకున్న వాళ్ళల్లో చాలామంది ఓడిపోయారని చెప్పి.. పవన్ కల్యాణ్ రెండుచోట్ల ఓడిపోయిన విషయంపై సెటైర్లు వేశారు.
దాంతో జనసేన నేతలకు మండిపోయి గొడవకు దిగారు. వెంటనే టీడీపీ నేతలు, కార్యకర్తలు రెచ్చిపోయారు. మాటమాట పెరిగి గొడవ పెద్దదై కుర్చీలు విసిరేసుకుని కొట్టుకున్నారు. పిఠాపురంలో జరిగింది ఒక శాంపిల్ మాత్రమే. ఇలాంటివి ఇంకా ఎన్నిచూడాల్సుంటుందో.