పిఠాపురంలో వర్మకు అంత సీన్ ఉందా..?
తనకి తాను బిల్డబ్ ఇచ్చుకోడానికే వర్మ ఈ తప్పుడు ప్రచారానికి తెరతీశారని, మళ్లీ ఆయనే ఆ ప్రచారాన్ని ఖండిస్తున్నట్టు చెబుతున్నారని అంటున్నారు.
పిఠాపురంలో కూటమి అభ్యర్థిగా పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్నారు. అయితే ఆయన ప్రచారంలో టీడీపీ నేత వర్మ ఎప్పుడూ పక్కనే కనపడుతున్నారు. టీడీపీ తరపున టికెట్ ఆశించి భంగపడిన వర్మ, ఓ దశలో రెబల్ గా మారబోయిన నేపథ్యంలో పవన్ వచ్చి బుజ్జగించారు, చంద్రబాబు ఎమ్మెల్సీ సీటు ఆఫర్ చేశారు. దీంతో ఆయన కాస్త శాంతించారు, ఇప్పుడు పవన్ వెంటే తిరుగుతున్నారు వర్మ. అయితే ఇటీవల వర్మ మళ్లీ టాక్ ఆఫ్ పిఠాపురం అయ్యారు. ఆయన వైసీపీలోకి వెళ్లిపోతున్నారని, పవన్ కు అక్కడ కష్టమేననే ప్రచారం జరిగింది. దీన్ని వర్మ వెంటనే ఖండించారు. తాను చంద్రబాబు మనిషిని అని టీడీపీలోనే ఉంటానని వివరణ ఇచ్చారు.
వర్మకు అంత సీన్ ఉందా..?
పిఠాపురంలో పవన్ ని ఓడించేందుకే వైసీపీ వర్మకు గేలం వేస్తోందనే ప్రచారం జరుగుతోంది. అయితే నిజంగానే వర్మకు అంత సీన్ ఉందా అనే చర్చ కూడా మొదలైంది. తనకి తాను బిల్డబ్ ఇచ్చుకోడానికే వర్మ ఈ తప్పుడు ప్రచారానికి తెరతీశారని, మళ్లీ ఆయనే ఆ ప్రచారాన్ని ఖండిస్తున్నట్టు చెబుతున్నారని అంటున్నారు. పిఠాపురంలో వర్మ మైండ్ గేమ్ ఆడుతున్నారని, వైసీపీ తనకు ఆఫర్ ఇచ్చిందని చెబుతూ.. పవన్ దగ్గర మరింత పెద్ద ఆఫర్ కొట్టేసేందుకు ఆయన ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు.
పవన్ లో భయం..
గతంలో భీమవరం కాకపోతే గాజువాక అనుకుంటూ రెండు చోట్లా ఓడిపోయారు పవన్. ఈసారి ఒక్క పిఠాపురంలోనే పోటీ చేస్తున్నారు. కానీ అక్కడ వంగా గీత బలంగా ఉన్నారు. ఆమె చేతిలో పవన్ కి ఓటమి తప్పదనే సంకేతాలు వెలువడుతున్నాయి. వర్మపై అనుమానంతో ఆయన్ను నిత్యం వెంట బెట్టుకుని తిరుగుతున్నారు పవన్, టీడీపీ ఓటు బ్యాంక్ తనతోనే ఉండే విధంగా వ్యూహ రచన చేస్తున్నారు. ఇక మెగా ఫ్యామిలీని కూడా రంగంలోకి దింపారు. వరుణ్ తేజ్ ఆల్రడీ వచ్చేశారు, నాగబాబుతోపాటు ఆయన భార్య కూడా ప్రచారం చేస్తున్నారు. త్వరలో చిరంజీవి, చివర్లో రామ్ చరణ్ కూడా ప్రచారానికి వస్తారని అంటున్నారు. ఓటమి భయంతోనే పవన్ ఈ ఫీట్లు చేస్తున్నారని తేలిపోయింది.