Telugu Global
Andhra Pradesh

సిట్టింగ్ జడ్జితో విచారణకు నేను సిద్ధం -పిన్నెల్లి

అభివృద్ది చేసే చరిత్ర తమదని అన్నారు పిన్నెల్లి. మాచర్ల అల్లర్లపై సిట్టింగ్ జడ్జితో విచారణకు తాను సిద్దం అని చెప్పారు.

సిట్టింగ్ జడ్జితో విచారణకు నేను సిద్ధం -పిన్నెల్లి
X

ఈసారి ఎన్నికల్లో పల్నాడు ప్రాంతం టాక్ ఆఫ్ ఏపీగా నిలిచింది. ముఖ్యంగా మాచర్ల నియోజకవర్గంలో జరిగిన అల్లర్లు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కూడా ఈ అల్లర్లపై దృష్టిపెట్టింది. ఈ దశలో స్థానిక వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ప్రత్యర్తి జూలకంటి బ్రహ్మారెడ్డికి హత్యలు చేసే చరిత్ర ఉందని, ఆయన ఏడు హత్య కేసుల్లో ఏ-1 ముద్దాయిగా ఉన్నారని అన్నారు పిన్నెల్లి. ఈసారి ఎన్నికల హింసకు కారణం అయనేనని మండిపడ్డారు. తాను ఏ తప్పూ చేయలేదన్నారు.


వైసీపీ పాలనలో మాచర్ల నియోజకవర్గం అభివృద్ధి చెందిందని చెప్పారు పిన్నెల్లి. నీతి కబుర్లు చెబుతూ షో చేస్తూ చందాల మీద బతికే వ్యక్తి జూలకంటి బ్రహ్మారెడ్డి అని ఎద్దేవా చేశారు. అభివృద్ది చేసే చరిత్ర తమదని అన్నారు. మాచర్ల అల్లర్లపై సిట్టింగ్ జడ్జితో విచారణకు తాను కూడా సిద్దం అని అన్నారు. 2009లో తనపై ఓడిపోయి మాచర్ల నుంచి తన ప్రత్యర్థి బ్రహ్మారెడ్డి పారిపోయారని చెప్పారు పిన్నెల్లి. తానెక్కడికీ పారిపోలేదని వివరణ ఇచ్చారు.

మరోవైపు టీడీపీ కూడా పిన్నెల్లిపై ఎదురుదాడికి దిగింది. హౌస్ అరెస్ట్ లో ఉన్న పిన్నెల్లి, పోలీసుల కళ్లుగప్పి పారిపోయాడని, ఆయన ఎక్కడ ఉన్నాడో ఎందుకు చెప్పడం లేదని నిలదీస్తున్నారు టీడీపీ నేతలు. పోలింగ్ రోజు ఎమ్మెల్యే పిన్నెల్లి, ఈవీఎంను ధ్వంసం చేశారంటూ ఓ వీడియోని సోషల్ మీడియాలో టీడీపీ పోస్ట్ చేసింది. పిన్నెల్లి వల్లే అల్లర్లు జరిగాయన్నది. అయితే ఈ వీడియోని ఇంతవరకు ఎందుకు బయట పెట్టలేదని నిలదీస్తున్నారు వైసీపీ నేతలు. ఇందులో కుట్రకోణం ఉందన్నారు. దీనిపై ఎమ్మెల్యే స్పందించాల్సి ఉంది.



First Published:  22 May 2024 6:19 AM IST
Next Story