Telugu Global
Andhra Pradesh

నేనెక్కడికీ పారిపోలేదు -పిన్నెల్లి

2009 నుంచి మాచర్లలో వరుసగా గెలుస్తూ వస్తున్న తాను ఎందుకు పారిపోతానని ప్రశ్నించారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ఈ గొడవలకు కారణం చంద్రబాబేనని అన్నారు.

నేనెక్కడికీ పారిపోలేదు -పిన్నెల్లి
X

పిన్నెల్లి సోదరులు పారిపోయారు, మరికొందరు వైసీపీ నేతలు పారిపోడానికి రెడీగా ఉన్నారంటూ.. ఎల్లో మీడియా ఊదరగొట్టడం అందరం చూశాం. వైసీపీ ఓడిపోతుందని తెలిసి ఇలా పిన్నెల్లి సోదరులు పారిపోయారని కొందరు, అరస్ట్ చేస్తారనే భయంతో పారిపోయారని మరికొందరు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. అయితే అసలు తానెక్కడికీ పారిపోలేదని చెప్పారు మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. సాక్షి న్యూస్ ఛానెల్ డిస్కషన్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఎల్లో మీడియాలో వస్తున్న వార్తల్ని కొట్టిపారేశారు.


అల్లర్లకు కారణం వారే..

ఎన్నికల రోజు, ఆ తర్వాత పల్నాడు ప్రాంతంలో అల్లర్లు జరిగాయి. మాచర్ల నియోజకవర్గంలో కూడా గొడవలు జరిగాయి. ఈ గొడవలకు టీడీపీ నేతలే కారణం అని ఆరోపించారు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మానందరెడ్డి గతంలో రెండుసార్లు తనపై పోటీ చేసి ఓడిపోయారని, ఈసారి రిగ్గింగ్ చేసేందుకు ఆయన ప్రయత్నించారన్నారు. ఎన్నికలకు 10రోజుల ముందు ఎస్పీని మార్చారని, రెండు రోజుల ముందు ఓ సీఐని మార్చారని అన్నారు. అల్లర్లకు ప్రధాన కారణం సీఐ నారాయణ స్వామి అని చెప్పారు పిన్నెల్లి.

2009 నుంచి మాచర్లలో వరుసగా గెలుస్తూ వస్తున్న తాను ఎందుకు పారిపోతానని ప్రశ్నించారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ఈ గొడవలకు కారణం చంద్రబాబేనని అన్నారు. తనపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు. ఓ ప్లాన్ ప్రకారమే మాచర్లలో గొడవలు సృష్టించారన్నారు. పైగా తనపైనే నిందలు వేస్తున్నారని చెప్పారు. తాను అల్లర్లను ప్రోత్సహిస్తే.. తమ పార్టీ వాళ్లే బాధితులు ఎందుకు అవుతారన్నారు పిన్నెల్లి. వ్యక్తిగత పనులపై తాను హైదరాబాద్ వెళ్లానని వివరణ ఇచ్చారు.

First Published:  17 May 2024 7:55 PM IST
Next Story