Telugu Global
Andhra Pradesh

ఫోన్ ట్యాపింగ్ అంత సులభం కాదు.. వైసీపీకి మద్దతుగా మాట్లాడిన వీవీ లక్ష్మీనారాయణ

సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ ఫోన్ ట్యాపింగ్ అంత సులభం కాదని స్పష్టం చేస్తున్నారు.

ఫోన్ ట్యాపింగ్ అంత సులభం కాదు.. వైసీపీకి మద్దతుగా మాట్లాడిన వీవీ లక్ష్మీనారాయణ
X

ఏపీలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. అధికార వైసీపీ, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఏకంగా ప్రభుత్వం, సీఎం వైఎస్ జగన్‌పై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేశారు. వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రాంనారాయణ రెడ్డి కూడా తన ఫోన్ ట్యాప్ అవుతోందంటూ మీడియాకు వెల్లడించారు. ఇది ట్యాపింగ్ కాదని, వేరే ఎవరో చేసిన వాయిస్ రికార్డింగ్‌ అంటూ మంత్రి బాలినేని, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. అయినా, కోటంరెడ్డి మాత్రం ఈ విషయాన్ని అంత తేలికగా తీసుకోవడం లేదు.

ట్యాపింగ్ భయంతో తాను సిమ్స్ మార్చాల్సి వస్తోందని కోటంరెడ్డి అనగా, తాను వాట్సప్, టెలిగ్రామ్ వంటి ఇతర యాప్‌లలో మాట్లాడుతున్నానని ఆనం చెప్పుకొచ్చారు. ప్రతిపక్ష టీడీపీ నాయకులతో పాటు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు పట్టుకొని ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో అధికార పార్టీకి, సీఎం జగన్‌కు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అనుకోని మద్దతు లభించింది. ఒకప్పుడు జగన్ అక్రమాస్తుల ఆరోపణలపై విచారణ చేసిన సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ ఫోన్ ట్యాపింగ్ అంత సులభం కాదని స్పష్టం చేస్తున్నారు.

కేంద్ర హోం శాఖ పరిధిలోని ఇంటెలిజెన్స్ బ్యూరో, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ వంటి సంస్థలకు మాత్రమే ఎవరి ఫోన్లను అయినా ట్యాప్ చేసే అవకాశం ఉంటుందని అన్నారు. అవన్నీ కేంద్ర పరిధిలోని సంస్థలే అని గుర్తు చేశారు. అంతే కానీ.. రాష్ట్ర ప్రభుత్వం ఏ వ్యక్తి ఫోన్‌ను ట్యాప్ చేయలేదని లక్ష్మినారాయణ స్పష్టం చేశారు.

ఏ రాష్ట్ర ప్రభుత్వమైన ప్రజా ప్రతినిధుల, పౌరుల ఫోన్ ట్యాప్ చేయాలంటే తప్పకుండా కేంద్ర హోం శాఖ అనుమతి తీసుకోవల్సి ఉంటుదని తేల్చి చెప్పారు. అయితే, ఎందుకు ఫోన్ ట్యాప్ చేయాలనుకుంటున్నారో న్యాయమైన కారణం చెప్పాల్సి ఉంటుందని, ఆ తర్వాత కేంద్ర హోం శాఖ కార్యదర్శి అనుమతి ఇస్తే ట్యాప్ చేసుకోవడానికి వీలుంటుందని అన్నారు. జాతీయ భద్రత, అంతర్జాతీయ సంబంధాలకు చెందిన విషయాల్లో మాత్రమే ఫోన్ ట్యాపింగ్‌కు అనుమతి లభిస్తుందని లక్ష్మీనారాయణ తెలిపారు.

ప్రస్తుతం బయటకు వచ్చిన రికార్డింగ్స్‌ను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపితే.. అది ట్యాపింగా, రికార్డింగా అనే విషయం బయటపడుతుందని ఆయన చెప్పారు. ఏవైనా సందేహాలు ఉంటే కోటంరెడ్డి కోర్టులను ఆశ్రయించవచ్చని సలహా ఇచ్చారు. ఇటీవల కాలంలో మాజీ జేడీ లక్ష్మీనారాయణ వరుసగా సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడుతుండటం గమనార్హం.

First Published:  4 Feb 2023 6:17 PM IST
Next Story