ఓసారి వచ్చిపో ఉమా.. సీఐడీ నన్ను వేధిస్తోంది
సీఐడీ కార్యాలయానికి వచ్చి అంబటి రాంబాబుపై ఇచ్చిన ఫిర్యాదు విషయంలో స్టేట్‌మెంట్ ఇవ్వాల్సిందిగా సీఐడీ అధికారులు కోరుతున్నట్లు సమాచారం.
అసత్య ప్రచారం ఆరోపణల కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమాకు మరోసారి ఏపీ సీఐడీ నుంచి పిలుపు వచ్చింది. సీఐడీ ఆఫీసుకు రావాల్సిందిగా దేవినేని ఉమాకు ఫోన్ కాల్స్ వెళ్తున్నాయి. దీనిపై దేవినేని ఉమా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏపీ సీఐడీ తనను వేధిస్తోందని ఆరోపించారు. రెండు రోజులుగా వరుసగా ఫోన్లు చేసి సీఐడీ కార్యాలయానికి రావలసిందిగా ఒత్తిడి చేస్తున్నారని చెప్పారు.
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ను కించపరుస్తూ తాను ఎలాంటి ట్వీట్ చేయకపోయినప్పటికీ ఒక నకిలీ ట్వీట్ ను సృష్టించి.. తాను పవన్ కల్యాణ్ ను కించపరిచినట్టు అంబటి రాంబాబు సోషల్ మీడియాలో ప్రచారం చేశారంటూ కొద్దిరోజుల క్రితం దేవినేని ఉమా సీఐడీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంబటి రాంబాబు పై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ వ్యవహారంలోనే దేవినేని ఉమాకు సీఐడీ నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయి. సీఐడీ కార్యాలయానికి వచ్చి అంబటి రాంబాబుపై ఇచ్చిన ఫిర్యాదు విషయంలో స్టేట్‌మెంట్ ఇవ్వాల్సిందిగా సీఐడీ అధికారులు కోరుతున్నట్లు సమాచారం. తాను ఫిర్యాదు ఇస్తే నిందితుడిని విచారణకు పిలవకుండా ఫిర్యాదుదారుడైన తననెందుకు పిలుస్తున్నారని దేవినేని ఉమా అభ్యంతరం తెలుపుతున్నారు. అసలు సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ కు తనపై ఎందుకు ఇంత ప్రేమ వచ్చిందో చెప్పాలన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డిని ప్రశ్నించినందుకా.. లేక లండన్ మందుల గురించి లేవనెత్తినందుకా అని ఉమా వ్యాఖ్యానించారు. దొంగను పట్టుకోకుండా తన వెంట పడతారేంటి అని ప్రశ్నించారు.
తానేమి సీఐడీ విచారణకు భయపడడం లేదని కానీ, నోటీసులు ఇవ్వకుండా సీఐడీ కార్యాలయానికి రావాల్సిందిగా ఎలా పిలుస్తారని ఆయన ప్రశ్నించారు. ఇదివరకే పలుమార్లు మాజీ మంత్రి దేవినేని ఉమాను సీఐడీ పోలీసులు విచారించారు. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల సమయంలో వైసీపీని దెబ్బ కొట్టేందుకు దేవినేని ఉమా తిరుపతి వేదికగా మీడియా సమావేశంలో ఒక ఫేక్ వీడియోను ప్రదర్శించారు. గతంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరుపతి పట్టణాన్ని కించపరిచేలా మాట్లాడారంటూ ఒక వీడియోను ఉమా ప్రదర్శించారు. అయితే అది ఫేక్ వీడియోగా ఆ తర్వాత తెలియడంతో సీఐడీ కేసు నమోదు చేసింది. ఆ కేసులోనే పలుమార్లు ఆయనను విచారించింది. ఇంకా ఆ కేసులో విచారణ కొనసాగుతోంది.