మహాసేన టు జనసేన.. పి.గన్నవరంలో మరో వెన్నుపోటు
విమర్శలతో విసిగివేసారిపోయిన రాజేష్ ని పక్కకు తప్పించి ఆ సీటుని జనసేన ఖాతాలో వేశారు. బాబు మైండ్ గేమ్ తో మరో దళితబిడ్డ దారుణంగా అవమానానికి గురయ్యారు, అన్యాయమైపోయారు.
మహాసేన రాజేష్ టీడీపీకి ఎంత చేశారో, ఏం చేశారో అందరికీ తెలుసు. ఎల్లో మీడియాకంటే ఎన్నో రెట్లు ఎక్కువగా రాజేష్ టీడీపీకి కాపు కాశారు. ఎన్నో కేసులు ఎదుర్కొన్నారు, సోషల్ మీడియాలో విమర్శలను కాచుకున్నారు, చంద్రబాబు, లోకేష్ పై మాట పడనీయకుండా ఎదురుదాడికి దిగేవారు. అలాంటి రాజేష్ కి ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన పి.గన్నవరంను కేటాయించారు చంద్రబాబు. అయిష్టంగానే ఆయన ఆ పని చేశారని ఆ తర్వాత తేలింది. సీటిచ్చినట్టే ఇచ్చి కొన్ని వర్గాలను రెచ్చగొట్టి పొగబెట్టారు చంద్రబాబు. దీంతో రాజేష్ పరిస్థితి దారుణంగా తయారైంది. అప్పటి వరకూ లేని వ్యతిరేకతను ఆయన మూటగట్టుకున్నారు. అప్పటి వరకూ వైసీపీకే శత్రువుగా ఉన్న ఆయన, హిందూ వర్గాలకు కూడా శత్రువుగా మారిపోయారు. సీటిచ్చినందుకు చంద్రబాబుని ఏమీ అనలేరు, వద్దని అంటున్నందుకు ఆయా వర్గాలపై కూడా ఘాటు వ్యాఖ్యలు చేయలేరు. ఇలా రాజేష్ ను హింసించీ హింసించీ చివరకు చీటీ చించేశారు. ఆ సీటు కాస్తా జనసేనకు ఖరారు చేశారు.
ఇదో వెరైటీ పోటు..
నమ్మించి గొంతుకోయడం, వెన్నుపోటు పొడవడంలో చంద్రబాబు స్పెషలిస్ట్ అని అందరికీ తెలుసు. కానీ పిలిచి టికెట్ ఇచ్చినా కూడా చంద్రబాబుని నమ్మలేని పరిస్థితి ఇది. టికెట్ ఇచ్చారు, కానీ అక్కడ పోటీ చేసే పరిస్థితి లేకుండా చేశారు. తనకు తానే ఈ సీటు నాకొద్దుబాబోయ్ అనేలా చేశారు. ఆ తర్వాత సీరియస్ గా వచ్చి పరిస్థితి చక్కబరిచినట్టు బిల్డప్ ఇచ్చారు. అప్పటికే విమర్శలతో విసిగివేసారిపోయిన రాజేష్ ని పక్కకు తప్పించి ఆ సీటుని జనసేన ఖాతాలో వేశారు. బాబు మైండ్ గేమ్ తో మరో దళితబిడ్డ దారుణంగా అవమానానికి గురయ్యారు, అన్యాయమైపోయారు.
తాజాగా పి.గన్నవరం నియోజకవర్గ నేతలతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమావేశం అయ్యారు. గిడ్డి సత్యనారాయణకు టికెట్ ఖరారు చేసినట్టు ప్రకటించారు. ఎన్నికల నియమావళి, నిబంధనలతో కూడిన పత్రాలను గిడ్డి సత్యనారాయణకు పవన్ కల్యాణ్ అందజేశారు. గతంలో ఇక్కడ ప్రతిపక్షాలకు కనీసం నామినేషన్ వేసే ధైర్యం కూడా లేకుండా చేశారని, అలాంటి పరిస్థితి నుంచి జనసేన నాయకులు నిలబడ్డారని, నిలదొక్కుకున్నారని చెప్పారు పవన్. ఎన్నికల వరకు ఇదే స్ఫూర్తిని చాటుతూ జనసేన విజయానికి కృషి చేయాలన్నారు. దీంతో జనసేనలో సంబరాలు మొదలయ్యాయి. టికెట్ కోల్పోయిన మహాసేన రాజేష్ వర్గంలో నిరాశ చంద్రబాబుపై మండిపడుతోంది.