పెట్రో ధరలు దేశంలోకెల్లా ఏపీలోనే అధికం.. ఎందుకంటే..?
Petrol, Diesel prices in Andhra Pradesh: పొరుగు రాష్ట్రాలైన, తెలంగాణ, కర్నాటక, తమిళనాడు, ఒడిశాల్లో ఏపీ కంటే రేట్లు తక్కువగా ఉన్నాయి. దేశంలోకెల్లా ఏపీలోనే పెట్రోల్ ధరలు అత్యథికం.
బీజేపీ హయాంలో దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. గతంలో పైసల్లో ధరలు పెరిగినా రోడ్డెక్కి విన్యాసాలు చేసేవారు బీజేపీ నేతలు, ఇప్పుడు రూపాయలు, పదులు, వందల్లోకి వచ్చేసింది పెంపు. ఈ మధ్య భారీ వ్యతిరేకత రావడంతో కాస్త తగ్గారు కానీ, మోదీ అప్పటికే మోత మోగించారు. అయితే కొన్ని రాష్ట్రాలు సందట్లే సడేమియాలాగా స్థానిక పన్నులతో మోదీకి జతకలిశాయి. ప్రజలపై పెనుభారం మోపాయి. అలాంటి రాష్ట్రాల్లో ఏపీ నెంబర్-1 స్థానంలో ఉంది.
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు అన్ని రాష్ట్రాల్లో కెల్లా ఆంధ్ర ప్రదేశ్ లోనే అధికంగా ఉన్నాయి. ఈమేరకు కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తేలి లోక్ సభలో అడిగిన ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఆగస్ట్ నుంచి నవంబరు మధ్యకాలంలో ఏపీలో పెట్రోల్ ధర లీటరుకు రూ.111.87, డీజిల్ రూ.99.61 మేర ఉంది. ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా ఇలాంటి ధరలు లేవు. పొరుగు రాష్ట్రాలైన, తెలంగాణ, కర్నాటక, తమిళనాడు, ఒడిశాల్లో ఏపీ కంటే రేట్లు తక్కువగా ఉన్నాయి.
అత్యల్ప ధరలు ఎక్కడ, ఎంత..?
దేశంలో పెట్రోల్, డీజిల్ అత్యల్ప ధరలు అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్నాయి. అక్కడ పెట్రోల్ రూ.84.10, డీజిల్ రూ.79.74 మాత్రమే. దేశంలోని 35 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 16 చోట్ల మాత్రమే పెట్రోల్ ధర సెంచరీ దాటింది, డీజిల్ ధర 90 రూపాయలకంటే ఎక్కువగా ఉంది. ఒకరకంగా తమ వసూళ్ల పాపాన్ని కవర్ చేసుకోడానికి కేంద్రం ఈ డేటా విడుదల చేసింది అనుకున్నా, రాష్ట్రాల మధ్య వ్యత్యాసం ఎంత ఉంది అని చెప్పడానికి కేంద్ర మంత్రి విడుదల చేసిన ఈ సమాచారం ఉపయోగపడుతోంది. గతంలో ప్రతిపక్షాలు కూడా ఏపీ ప్రభుత్వంపై పెట్రోల్ ధరల విషయంలో తీవ్ర విమర్శలు చేశాయి. రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న పెట్రోల్ బంకులు ఈ విధానం వల్ల మూసేసుకోవాల్సిన పరిస్థితి. సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నవారు పొరుగు రాష్ట్రాలకు వెళ్లి పెట్రోల్ తెచ్చుకుంటున్నారు. పక్క రాష్ట్రాలకు దగ్గర్లో హైవేలపై ఉన్న పెట్రోల్ బంకులకు కూడా గిరాకీ బాగా తగ్గిపోయింది. పెట్రోల్, డీజిల్ విషయంలో కేంద్రం దోచుకున్నంత దోచుకుని, మరికొంత అవకాశం రాష్ట్రాలకు ఇవ్వడం దారుణం. నెపం రాష్ట్రాలపై వేసేందుకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నా, కొన్నిచోట్ల రాష్ట్రాలు కూడా ఖజానాపై ఆర్థిక భారం దించుకోడానికి పెట్రోల్, డీజిల్ పై పన్నులు బాదేస్తున్నాయి. అందులో ఏపీ ముందు వరుసలో ఉంది.