Telugu Global
Andhra Pradesh

నిర్మాణ సంస్థకు టీడీపీ పంగనామాలు

ఇప్పుడు తాజాగా మరో పిటిషన్ తెలంగాణ హైకోర్టులో దాఖలు అయింది

నిర్మాణ సంస్థకు టీడీపీ పంగనామాలు
X

గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం మరో వివాదంలో చిక్కుకుంది. ఇప్పటికే ఈ భవనాన్ని పోరంబోకు స్థలంలో నిర్మించినట్టు న్యాయస్థానంలో ఒక వివాదం నడుస్తోంది. ఇప్పుడు తాజాగా మరో పిటిషన్ తెలంగాణ హైకోర్టులో దాఖలు అయింది.

ఈ భవన నిర్మాణాన్ని చేసిన కాంట్రాక్టు సంస్థ ఈ పిటిషన్ దాఖలు చేసింది. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయ నిర్మాణాన్ని తొలుత విశాఖపట్నం చెందిన ఎస్.ఆర్.ఆర్ నిర్మాణ సంస్థకు అప్పగించారు. అయితే ఆ సంస్థ ఆ తర్వాత సబ్ కాంట్రాక్ట్ కింద హైదరాబాద్ కు చెందిన ప్రెకా సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు నిర్మాణ బాధ్యతల్ని అప్పగించింది.

ఒప్పందం మేరకే ప్రెకా సొల్యూషన్స్ మొత్తం 21 కోట్ల రూపాయల విలువైన పనుల్ని టీడీపీ కేంద్ర కార్యాలయంలో చేసింది. 2019 డిసెంబర్లో 8.21 కోట్లకు ప్రీ ఫైనల్ బిల్లును సమర్పించింది. అయితే ఈ బిల్లు చెల్లించేందుకు ఎస్.ఆర్.ఆర్ నిర్మాణ సంస్థ గానీ, అటు తెలుగుదేశం పార్టీ కానీ ముందుకు రాలేదు. తెలుగుదేశం పార్టీ, ఎస్ఆర్ఆర్ నిర్మాణ సంస్థ ఇద్దరూ ఒకరిపై ఒకరు కారణాలు చెప్పుకుంటూ నిర్మాణ పనులు చేసిన ప్రెకాకు మాత్రం డబ్బులు చెల్లించలేదు. తమ బకాయిలు చెల్లించాల్సిందిగా తొలుత ఎస్ఆర్ఆర్ నిర్మాణ సంస్థను ప్రెకా సంస్థ కోరగా నేరుగా తెలుగుదేశం పార్టీ నుంచే డబ్బులు వసూలు చేసుకోండి అంటూ స్పష్టం చేసింది.

ఇది వరకు కూడా చెల్లింపులు తమ ప్రమేయం లేకుండా నేరుగా తెలుగుదేశం పార్టీని చేస్తోంది కాబట్టి ఇప్పుడు కూడా అదే తరహాలో డబ్బులు రాబట్టుకోవాలంటూ ప్రెకాకు ఎస్ఆర్ఆర్ నిర్మాణ సంస్థ సలహా కూడా ఇచ్చింది. ఈ అంశాన్ని తాము టీడీపీ అధినేత వద్ద ప్రస్తావించామని, ఇందులో మీరు జోక్యం చేసుకోవద్దు నేరుగా ప్రెకా సంస్థకే తాము బిల్లులు చెల్లిస్తామంటూ చంద్రబాబు నాయుడు కూడా చెప్పారని ఎస్.ఆర్.ఆర్ నిర్మాణ సంస్థ ప్రెకాకు స్పష్టం చేసింది.

తెలుగుదేశం పార్టీని సంప్రదించినా అక్కడి నుంచి కూడా బిల్లుల చెల్లింపుపై సరైన హామీ రాలేదు. ఈ నేపథ్యంలోని ప్రెకా సంస్థ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తమకు రావాల్సిన డబ్బులు ఇప్పించాల్సిందిగా విజ్ఞప్తి చేసింది. తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన సంస్థ మధ్యవర్తిత్వ దరఖాస్తును దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. వివాద పరిష్కారానికి మధ్యవర్తిగా హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ స్వరూప్ రెడ్డిని నియమించింది. ఇరుపక్షాల మధ్య తలెత్తిన వివాదాన్ని పరిష్కరించి చట్ట ప్రకారం తగిన ఉత్తర్వులు జారీ చేసేందుకు వీలుగా స్వరూప్ రెడ్డిని తెలంగాణ హైకోర్టు నియమించింది. కోట్ల రూపాయల విలువైన పనులు చేసి కేంద్ర కార్యాలయాన్ని నిర్మించిన సంస్థకే తెలుగుదేశం పార్టీ బిల్లు చెల్లించకుండా ఎగ్గొట్టే ప్రయత్నం చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

First Published:  15 July 2022 2:43 AM GMT
Next Story