చిరుత: అలిపిరి టు హైకోర్టు..
అలిపిరి నడక మార్గంలో రెండు వైపులా కంచె వేయాల్సిందేనంటూ భానుప్రకాష్ రెడ్డి హైకోర్టు మెట్లెక్కారు. కంచె వేసే విధంగా టీటీడీకి, అటవీ శాఖకు ఆదేశాలివ్వాలని న్యాయస్థానాన్ని ఆయన కోరారు.
అలిపిరిలో చిరుత అలజడి ఇప్పుడు హైకోర్టుకి చేరుకుంది. ఇప్పటికే టీటీడీ అన్ని రక్షణ చర్యలు తీసుకున్నామని చెబుతోంది. ప్రత్యేక కమిటీతో నివేదిక తెప్పించే ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఈ చర్యల విషయంలో టీటీడీకి సూచనలివ్వాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు, బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి ఈ పిటిషన్ దాఖలు చేశారు.
తిరుమల నడక మార్గంలో కంచె ఏర్పాటుపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కంచె ఏర్పాటు చేస్తే జంతుజాలం స్వేచ్ఛను హరించి వేసినట్టవుతుందని పర్యావరణ ప్రేమికులంటున్నారు. అదే సమయంలో కంచె ఏర్పాటు చేసినా పెద్దగా ఉపయోగం ఉండదని, చెట్లు ఎక్కగల చిరుత, కంచెను దాటుకుని వచ్చేస్తుందని అటవీ శాఖ అధికారులంటున్నారు. జంతుజాలం మనుగడకు కూడా ఇది అవరోధంగా ఉంటుందన్నారు. అయితే నడక మార్గంలో రెండు వైపులా కంచె వేయాల్సిందేనంటూ భానుప్రకాష్ రెడ్డి హైకోర్టు మెట్లెక్కారు. కంచె వేసే విధంగా టీటీడీకి, అటవీ శాఖకు ఆదేశాలివ్వాలని న్యాయస్థానాన్ని ఆయన కోరారు.
కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలి..
చిరుత దాడిలో చనిపోయిన లక్షిత కుటుంబానికి టీటీడీ రూ.5 లక్షలు, అటవీ శాఖ రూ.5 లక్షలు పరిహారం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే పాప కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని తన పిటిషన్లో డిమాండ్ చేశారు భానుప్రకాష్ రెడ్డి. ఈ పిటిషన్ పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగే అవకాశముంది.