పంపకాల్లో వివాదం.. ప్రాణం తీసింది - విజయవాడలో చంపి.. బొమ్ములూరులో పాతిపెట్టారు
గతేడాది నవంబర్ 16న జరిగిన ఈ ఘటన సరిగ్గా ఏడాది తర్వాత వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో గుట్టును తాజాగా పోలీసులు బయటపెట్టారు.
వారంతా ఓ దొంగల ముఠా.. కలిసి చోరీలు చేస్తారు.. సమంగా పంచుకుంటారు.. కానీ ముఠాలో ఓ వ్యక్తి పంపకాల్లో మోసం చేయడంతో మిగిలినవారు కన్నెర్ర చేశారు. నమ్మకంగా బయటికి తీసుకెళ్లి.. ప్రాణాలు తీశారు. గతేడాది నవంబర్ 16న జరిగిన ఈ ఘటన సరిగ్గా ఏడాది తర్వాత వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో గుట్టును తాజాగా పోలీసులు బయటపెట్టారు.
పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం గొరిజవోలు గ్రామానికి చెందిన జంగం చంటి (28), గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన రాయపాటి వెంకన్న, తుమ్మా సుబ్రహ్మణ్యం, షేక్ సుభాని అలియాస్ సిద్ధు, ముత్యాల నవీన్, పల్నాడు జిల్లా దాచేపల్లికి చెందిన షేక్ నాగుల్ మీరా అలియాస్ బిల్లా... వీరంతా కలసి ముఠాగా ఏర్పడి చోరీలకు పాల్పడేవారు.
గతేడాది కేరళలో దొంగతనం చేసిన ఈ ముఠా సభ్యులు భారీ మొత్తంలో బంగారాన్ని అపహరించారు. అందులో కొంత బంగారాన్ని విక్రయించాలంటూ జంగం చంటికి ఇచ్చారు. బంగారాన్ని విక్రయించిన చంటి ఆ మొత్తాన్ని తిరిగి ముఠా సభ్యులకు ఇవ్వలేదు. దీంతో వారి మధ్య వివాదం చెలరేగింది. చంటిని హతమార్చేందుకు రాయపాటి వెంకన్న, మిగిలిన ముఠా సభ్యులు పథకం రచించారు. గతేడాది నవంబర్ 16న చంటి కుమారుడి అన్నప్రాసన కావడంతో అతన్ని పార్టీ ఇవ్వాలని కోరారు. మిత్రులతో కలసి బయటికి వెళ్లిన చంటిని విజయవాడలోని ఓ హోటల్‌కి తీసుకెళ్లి రూమ్ తీసుకుని అక్కడ ఇతర ముఠా సభ్యులు అతన్ని చితకబాదారు.
అనంతరం కారులో ఎక్కించుకొని క్యారీ బ్యాగ్‌తో ముఖానికి ముసుగు వేసి ఊపిరాడకుండా చేసి హతమార్చారు. మృతదేహాన్ని పూడ్చివేసేందుకు సరైన చోటు కోసం వెతుకుతూ జాతీయ రహదారి వెంట వెళుతుండగా, బొమ్ములూరు వద్ద రోడ్డు పక్కనే ఉన్న శ్మశానం కనిపించింది. అదే అనువైన స్థలంగా భావించి అక్కడ రాత్రి వేళలో గొయ్యి తీసి చంటి మృతదేహాన్ని పాతిపెట్టి నిందితులంతా పరారయ్యారు.
జంగం చంటి కనిపించడం లేదంటూ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. అతన్ని బయటికి తీసుకెళ్లిన ఇతర ముఠా సభ్యులపై అనుమానంతో వారిని పట్టుకుని తమదైన శైలిలో విచారించారు. దీంతో గుట్టంతా బయటపడింది.
సోమవారం నరసరావుపేట డీఎస్పీ విజయభాస్కర్ చిలకలూరిపేట సీఐ వై అచ్చయ్య ఘటనాస్థలికి చేరుకున్నారు. బాపులపాడు తహసీల్దార్, హనుమాన్ జంక్షన్ ఎస్ఐ సమక్షంలో శవాన్ని వెలికితీసి పంచనామా నిర్వహించారు.