ఏపీ, తెలంగాణ కలసిపోతాయా..? పేర్ని నాని ఆసక్తికర ట్వీట్
ఇరు రాష్ట్రాల డిమాండ్లు చూస్తుంటే రాష్ట్రాల పునరేకీకరణే ఏకైక మార్గం అంటూ వైసీపీ వెటకారం చేస్తోంది.
ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీపై బీఆర్ఎస్ మూడు రోజులుగా కీలక వ్యాఖ్యలు చేస్తోంది. ఈ భేటీపై ఈరోజు వరకు సైలెంట్ గా ఉన్న వైసీపీ.. తాజాగా వరుస కామెంట్లతో వాతావరణాన్ని వేడెక్కించింది. గతంలో చంద్రబాబు చేసిన తప్పు వల్ల ఏపీకి లక్షన్నర కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందంటూ వైసీపీ ట్వీట్ వేయగా, మాజీ మంత్రి పేర్ని నాని కూడా ఆసక్తికరంగా స్పందించారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ.. వారిద్దరి డిమాండ్లు చూస్తుంటే ఏపీ, తెలంగాణ పునరేకీకరణ ఏకైక మార్గంగా కనిపిస్తోందంటూ ట్వీట్ వేశారు నాని.
తెలుగు న్యూస్ ఛానళ్ళ బ్రేకింగ్ వార్తలు చూస్తుంటే.. నేటి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో ఇద్దరి డిమాండ్లు తీరాలంటే రెండు రాష్ట్రాల పునారేకీకరణయే ఏకైక మార్గంగా కనపడుతుంది !
— Perni Nani (@perni_nani) July 6, 2024
"తెలుగు న్యూస్ ఛానళ్ళ బ్రేకింగ్ వార్తలు చూస్తుంటే.. నేటి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో ఇద్దరి డిమాండ్లు తీరాలంటే రెండు రాష్ట్రాల పునరేకీకరణే ఏకైక మార్గంగా కనపడుతుంది!" అంటూ ట్వీట్ చేశారు పేర్ని నాని. సహజంగా ఆయన సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా కనపడరు. కానీ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ సందర్భంగా ఆసక్తికర ట్వీట్ తో తెరపైకి వచ్చారు.
రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ అజెండా అంశాలపై ఇప్పటికే తీవ్ర చర్చ జరుగుతోంది. మీకివి, మాకివి అంటూ రెండు రాష్ట్రాలు పలు డిమాండ్లతో ముందుకొచ్చాయి. హైదరాబాద్ లో భవనాలు కావాలని ఏపీ అడుగుతుంటే, పోర్టుల్లో వాటా కావాలని తెలంగాణ అడుగుతోంది. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల డిమాండ్లు చూస్తుంటే రాష్ట్రాల పునరేకీకరణే ఏకైక మార్గం అంటూ వైసీపీ వెటకారం చేస్తోంది.