Telugu Global
Andhra Pradesh

చంద్రంగారి కాలజ్ఞానం..

అసలు 2047కి ఎవరెవరుంటారు..? చంద్రబాబు చేసేదేంటి..? అని ప్రశ్నించారు. అప్పుడు చంద్రబాబు జయంతులు జరుగుతాయేమోనన్నారు. ఆయనది దిక్కుమాలిన విజన్ డాక్యుమెంట్ అంటూ కౌంటర్ ఇచ్చారు పేర్ని నాని.

చంద్రంగారి కాలజ్ఞానం..
X

విజన్ 2047 అంటూ చంద్రబాబు విడుదల చేసిన విజనరీ డాక్యుమెంట్ పై ఓ రేంజ్ లో సెటైర్లు పేల్చారు మాజీ మంత్రి పేర్ని నాని. గతంలో విజన్ 2020 అంటూ చంద్రబాబు ఓ పుస్తకం విడుదల చేయించారని గుర్తు చేసిన ఆయన, అప్పుడు ఏం సాధించారు, ఇప్పుడు ఏం సాధిస్తారని ప్రశ్నించారు. అసలు 2047కి ఎవరెవరుంటారు..? చంద్రబాబు చేసేదేంటి..? అని ప్రశ్నించారు. అప్పుడు చంద్రబాబు జయంతులు జరుగుతాయేమోనన్నారు. ఆయనది దిక్కుమాలిన విజన్ డాక్యుమెంట్ అంటూ కౌంటర్ ఇచ్చారు పేర్ని నాని.

విజన్ 2020 అంటూ చంద్రబాబు అంతకు ఇరవయ్యేళ్ల ముందే ప్రకటించారని, ఆ 20 ఏళ్ల కాలంలో 14 ఏళ్లపాటు ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారని, అయినా కూడా ఏమీ సాధించలేకపోయారని చెప్పారు పేర్ని నాని. విజన్ 2020లో ఆయన చేసిన ఒక్క మంచిపని అయినా ఉందా అని ప్రశ్నించారు.


విద్యా వ్యవస్థలో ఏపీని అట్టడుగు స్థాయికి చేర్చారని, ఒక్క స్కూల్ కూడా బాగుచేయలేకపోయారని, కనీసం నారావారి పల్లె స్కూల్ కూడా బాగు చేసుకోలేకపోయారని చంద్రబాబుపై మండిపడ్డారు పేర్ని నాని. వైద్య రంగంలో కూడా బాబు విజన్ శూన్యం అని చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో యూజర్ చార్జీల పేరుతో ప్రజలపై చంద్రబాబు భారం వేశారని గుర్తు చేశారు.

చంద్రబాబు హయాంలో మొదలైన లేదా చంద్రబాబు హయాంలో పూర్తయిన ఒక్క ప్రాజెక్ట్ పేరయినా చెప్పగలరా అని ప్రశ్నించారు పేర్ని నాని. వ్యవసాయ రంగంపై ఆధారపడిన ప్రజల సంఖ్య తగ్గించాలనేది చంద్రబాబు విజన్ 2020 అని గుర్తు చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య గణనీయంగా తగ్గించాలనేది కూడా ఆయన విజన్ అని ఎద్దేవా చేశారు.

వయసు కాదు, మనసు ముఖ్యం..

చంద్రబాబుకి వయసు పెరిగినా బుర్ర మాత్రం పెరగలేదని ఎద్దేవా చేశారు పేర్ని నాని. ఆయన కంటే వయసులో ఎంతో చిన్నవాడైన సీఎం జగన్ ఎంతో ముందు చూపుతో అన్ని రంగాల్లో తనదైన ముద్రవేశారని చెప్పారు. విద్య, వైద్యం, వ్యవసాయం.. అన్ని రంగాల్లో ఆయన విజన్ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తోందన్నారు. సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థ.. జగన్ విజన్ అని చెప్పారు.

చంద్రబాబు హయాంలో పాలన ఎలా ఉండేది, ఏయే మార్పులు జరిగాయి. ఇప్పుడు పాలన ఎలా ఉంది, ఎలాంటి మార్పులు జరిగాయో సోదాహరణంగా వివరించారు పేర్ని నాని. చంద్రబాబుకి దిక్కుమాలిన విజన్ అని మండిపడ్డారు. ఎన్టీఆర్ ని ఒక్క పోటు పొడిచి ముఖ్యమంత్రి అయిన బాబు.. ఆయన పాలన గొప్పగా ఉందని చెప్పుకుంటారని, మరి ఆయన్ను ఎందుకు వెన్నుపోటు పొడిచారని ప్రశ్నించారు నాని.

First Published:  16 Aug 2023 2:59 PM IST
Next Story