Telugu Global
Andhra Pradesh

సెల్ఫీలు, కోడిగుడ్లు.. లోకేష్ యాత్రపై సెటైర్లు

నారా లోకేష్ ఒక పార్టీకి అధ్యక్షుడు కాదని, కనీసం ఎమ్మెల్యే కూడా కాదని, ఒక మాజీ సీఎం కుమారుడికి ఇవ్వాల్సిన భద్రతకంటే ఎక్కువే ఇచ్చామని వివరించారు మాజీ మంత్రి పేర్ని నాని.

సెల్ఫీలు, కోడిగుడ్లు.. లోకేష్ యాత్రపై సెటైర్లు
X

ఆమధ్య నారా లోకేష్ యాత్రపై కోడిగుడ్ల దాడి అంటూ హడావిడి జరిగింది. అయితే ఆ దాడి చేసింది టీడీపీ కార్యకర్తలేనని, లోకేష్ తో సెల్ఫీ దిగే అవకాశం రానందుకే వారు ఆ పని చేశారని కడప ఏఎస్పీ చెప్పడం ఇప్పుడు వివాదానికి దారి తీసింది. కావాలనే పోలీసులు కట్టుకథలు అల్లుతున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. గవర్నర్ ని కలసి వినతిపత్రం ఇచ్చారు కూడా. లోకేష్ కు చిన్న హాని జరిగినా జగన్ దే బాధ్యత అంటూ ఫిర్యాదు చేసింది టీడీపీ బృందం. ఈ ఎపిసోడ్ పై తాజాగా పేర్ని నాని స్పందించారు. వాళ్ల పార్టీ నేతలే లోకేష్ పై కోడిగుడ్ల దాడి చేశారని, దానికి వైసీపీ నేతలు బాధ్యులు అనడం ఎంతవరకు సమంజసం అని అన్నారు పేర్ని నాని.

నారా లోకేష్ ఒక పార్టీకి అధ్యక్షుడు కాదని, కనీసం ఎమ్మెల్యే కూడా కాదని, ఒక మాజీ సీఎం కుమారుడికి ఇవ్వాల్సిన భద్రతకంటే ఎక్కువే ఇచ్చామని వివరించారు మాజీ మంత్రి పేర్ని నాని. 10 మంది జనం కనబడగానే ఇష్టమొచ్చినట్టు మాట్లాడే వ్యక్తి లోకేష్ అని ఎద్దేవా చేశారు. "టీడీపీ వాళ్లే కోడిగుడ్లు విసిరితే రక్షణ కరువవడం ఏంటి? మీ పార్టీ కార్యకర్తలకు ముందు క్రమశిక్షణ నేర్పించండి. సెల్ఫీలు దిగలేదని కోడిగుడ్లు విసురుతుంటే మాకేం​ సంబంధం?" అంటూ ప్రశ్నించారు పేర్ని నాని.

సీఎం జగన్ అన్ని వర్గాలకు అండగా నిలిచారని, ఉద్యోగులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని చెప్పారు పేర్ని నాని. సీఎం జగన్‌ చెప్పాడంటే చేస్తాడనే నమ్మ​కం, ఆశ.. ప్రజల్లో ఉన్నాయన్నారు. చంద్రబాబు ఏరోజూ మేనిఫెస్టోను పట్టించుకోలేదని.. మేనిఫెస్టోలోని 99 శాతం హామీలను సీఎం జగన్‌ నెరవేర్చారని గుర్తు చేశారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలను సీఎం జగన్‌ అమలు చేశారన్నారు.

First Published:  9 Jun 2023 3:55 PM IST
Next Story