Telugu Global
Andhra Pradesh

జగన్‌ని నమ్మినవారంతా పార్టీలోనే ఉన్నారు

అధికారంలో ఉండగా గుర్తురాని కనిగిరి.. చంద్రబాబుకు ఎన్నికల వేళ గుర్తొచ్చిందా అంటూ పేర్ని నాని ప్రశ్నించారు. కనిగిరికి కదలి రావాలంటూ పిలుపునిచ్చిన చంద్రబాబు.. ఎవరికి ఏం చేశారని కదలి రావాలని ఎద్దేవా చేశారు.

జగన్‌ని నమ్మినవారంతా పార్టీలోనే ఉన్నారు
X

అధికారం కోసం, అవసరాల కోసం వచ్చినవారే ఇప్పుడు వైసీపీని వీడుతున్నారని, జగన్‌ని నమ్మినవారంతా పార్టీలోనే ఉన్నారని మాజీ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. తాడేపల్లిలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు అధికారంలో ఉండగా కాపులు తునిలో మీటింగ్‌ పెట్టింది బాబు, పవన్‌ వారికి ఇచ్చిన హామీలను అమలు చేయమనేనని ఆయన గుర్తుచేశారు. తనకు కులం లేదన్న పవన్‌ కళ్యాణ్‌ ఇప్పుడు కులాల గురించి ఎందుకు మాట్లాడుతున్నారని పేర్ని నాని ప్రశ్నించారు. జనసేనకు నాయకులు లేకనే ఇతర పార్టీల వారిని ఆహ్వానిస్తున్నారని ఈ సందర్భంగా ఆయన ఎద్దేవా చేశారు.

కనిగిరి.. ఎన్నికల వేళ గుర్తొచ్చిందా?

అధికారంలో ఉండగా గుర్తురాని కనిగిరి.. చంద్రబాబుకు ఎన్నికల వేళ గుర్తొచ్చిందా అంటూ పేర్ని నాని ప్రశ్నించారు. కనిగిరికి కదలి రావాలంటూ పిలుపునిచ్చిన చంద్రబాబు.. ఎవరికి ఏం చేశారని కదలి రావాలని ఎద్దేవా చేశారు. చంద్రబాబు అధికారంలో ఉండగా చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఏవీ లేనందువల్లే.. తన ప్రసంగంలో ఎంతసేపూ సీఎం జగన్‌ను దూషించడమే పనిగా పెట్టుకున్నారని ఆయన విమర్శించారు. 14 ఏళ్ల పాలనలో గ్రామాల్లో ఒక్క ఆఫీసైనా చంద్రబాబు కట్టారా అని ఆయన నిలదీశారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు.. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు.

ఏం చేశావని నమ్మాలి బాబూ?

బెంగళూరు, హైదరాబాద్‌ లాంటి అవకాశాలను కల్పిస్తానంటూ కనిగిరి ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించారని పేర్ని నాని మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయని చంద్రబాబు.. అధికారం ఇస్తే అన్నీ చేస్తామంటారని ఆయన విమర్శించారు. బీసీలకు ఏం చేశావని నీకు ఓట్లు వేయాలి బాబూ.. ఎన్నికల సమయంలో మాత్రమే నీకు బీసీలు గుర్తుకు వస్తారా అంటూ నిలదీశారు. సీఎం జగన్‌ తన నాలుగున్నరేళ్ల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్‌ కాలేజీలు, పోర్టులు, గ్రామగ్రామానా సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలు, విలేజ్‌ హెల్త్‌ సెంటర్లు, పేదలకు ఇళ్లు కట్టించారని, నాడు–నేడు పథకం కింద పాఠశాలలను అభివృద్ధి చేశారని పేర్ని నాని ఈ సందర్భంగా వివరించారు. 2014లో 600 హామీలు ఇచ్చి ఒక్కటీ అమలు చేయని వ్యక్తి చంద్రబాబని, అలాంటి వ్యక్తిని రాష్ట్ర ప్రజలు ఎందుకు నమ్మాలని ఆయన ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాల వారి మ్యానిఫెస్టోలను కాపీ కొట్టడం తప్ప సొంత ఆలోచనలే లేని పార్టీ టీడీపీ అని ఆయన విమర్శించారు.

షర్మిల ఏపీకి వచ్చినా ఇబ్బంది లేదు..

షర్మిల ఒక రాజకీయ నాయకురాలని, ఆమె ఏపీకి వస్తే తమకేమి ఇబ్బంది ఉంటుందని పేర్ని నాని ప్రశ్నించారు. వైసీపీని వైఎస్‌ జగన్‌ ప్రారంభించారని, ఆయన్ని చూసే షర్మిల అయినా, తానైనా, ఇంకొందరైనా పార్టీలో చేరామని ఆయన చెప్పారు. పార్టీని కొందరు వదిలేసి పోయినంత మాత్రాన ఏం జరుగుతుందని ఆయన ప్రశ్నించారు. జగన్‌ను కాదంటున్న కాపు రామచంద్రారెడ్డి ఆయన బొమ్మ లేకుండా గెలవలేరనే విషయాన్ని గుర్తించాలని ఈ సందర్భంగా పేర్ని నాని చెప్పారు.

First Published:  6 Jan 2024 8:20 AM IST
Next Story