Telugu Global
Andhra Pradesh

అన్నం తిని కాదు, ఆయన బెయిల్ మీద బతుకుతున్నాడు..

చంద్రబాబు అన్నం తిని బతికేకన్నా బెయిల్ మీద బతుకుతుంటారని సెటైర్లు పేల్చారు పేర్ని నాని. మచిలీపట్నం సభపై కూడా చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఎల్లో మీడియా తప్పుడు వార్తలు రాస్తోందని విమర్శించారు నాని.

అన్నం తిని కాదు, ఆయన బెయిల్ మీద బతుకుతున్నాడు..
X

సీబీఐ ఎంక్వయిరీ, అరెస్ట్, బెయిల్ పిటిషన్, కోర్టులు.. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఇవే హాట్ టాపిక్ లు. అటు అధికారపక్షం అయినా, ఇటు ప్రతిపక్షం అయినా విమర్శల్లో ఈ పదాలు కచ్చితంగా కనపడాల్సిందే. కడప ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ ఎంక్వయిరీ విషయంలో టీడీపీ అనుకూల మీడియా రచ్చ చేస్తుంటే, మరోవైపు వైసీపీ నుంచి కూడా అదే స్థాయిలో ఘాటు విమర్శలు మొదలయ్యాయి. అవినాష్‌ రెడ్డి సీబీఐ విచారణపై ఎల్లో మీడియాకు అంత అత్యుత్సాహమెందుకని ప్రశ్నించారు మాజీ మంత్రి పేర్ని నాని. తల్లికి సీరియస్‌ గా ఉంటే ఇష్టమొచ్చినట్టు ప్రచారం చేస్తున్నారని, ముందస్తు బెయిల్ పిటిషన్ వేస్తే కూడా తప్పేనా? అని ప్రశ్నించారు.

గతంలో చంద్రబాబు ప్రభుత్వం జీవో 176 తీసుకొచ్చిందని, ఏపీ ప్రభుత్వం అనుమతి లేకుండా సీబీఐ రాష్ట్రంలోకి రాకూడదని చంద్రబాబే ఆ జీవో తెచ్చారని గుర్తు చేశారు పేర్ని నాని. ఇప్పుడు అదే సీబీఐ విషయంలో అవినాష్ రెడ్డిపై కక్షపూరితంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అధికారంలో మనోడు ఉంటే ఒకలా .. లేకుంటే మరోలా రాయడం ఎల్లో మీడియాకు వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు.

అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ వేయకూడదా..?

విచారణకు పిలిచిన ప్రతిసారీ అవినాష్ రెడ్డి, సీబీఐ ముందుకు వెళ్లారని, ఇప్పుడు మాత్రమే ఎందుకింత హడావిడి చేస్తున్నారని ప్రశ్నించారు పేర్ని నాని. అవినాష్ రెడ్డి ఎక్కడికైనా పారిపోయాడా? అన్నారు. చంద్రబాబు తన కేసుల విషయంలో ఎందుకు బెయిల్ తెచ్చుకున్నారన్నారు. చంద్రబాబు ఎన్నిసార్లైనా బెయిల్ తెచుకోవచ్చా? ఏ రోజైనా సీబీఐ విచారణకు వెళ్లారా? అప్పుడెందుకు ఇలాంటి రాతలు రాయలేదని ప్రశ్నించారు.

అన్నంతిని కాదు, బెయిల్ పై..

చంద్రబాబు అన్నం తిని బతికేకన్నా బెయిల్ మీద బతుకుతుంటారని సెటైర్లు పేల్చారు పేర్ని నాని. మచిలీపట్నం సభపై కూడా చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఎల్లో మీడియా తప్పుడు వార్తలు రాస్తోందని విమర్శించారు నాని. బందరు సభలో సీఎం జగన్ ప్రసంగాన్ని అందరూ శ్రద్దగా విన్నారని చెప్పారు. చంద్రబాబు సభలకు జనం రావడం లేదన్న వార్తలు ఎప్పుడైనా వేశారా ? అని ప్రశ్నించారు. ఖాళీ కుర్చీలకు స్పీచ్ ఇచ్చిన ఘనుడు చంద్రబాబు అన్నారు. చివరకు కేంద్రం ఇచ్చిన నిధులపై ఇష్టమొచ్చిన కథనాలు రాస్తున్నారని మండిపడ్డారు నాని.

First Published:  23 May 2023 7:43 PM IST
Next Story