ఏపీలో అతిపెద్ద ఎలక్ట్రిక్ వెహికిల్స్ ప్లాంట్.. జర్మనీ సంస్థ పెప్పర్ మోషన్ ప్రకటన
ఈ ప్లాంట్ ఏర్పాటుకు చిత్తూరు జిల్లా పుంగనూరులో రాష్ట్ర ప్రభుత్వం 800 ఎకరాల భూమిని కేటాయించింది. దీంతోపాటు పలు సబ్సిడీలు ఇచ్చింది.
జర్మనీకి చెందిన ప్రఖ్యాత ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ పెప్పర్ మోషన్ త్వరలో ఆంధ్రప్రదేశ్‌లో తన ప్లాంట్‌ను నెలకొల్పబోతోంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదిరినట్లు ఆ సంస్థ తాజాగా ప్రకటించింది. చిత్తూరు జిల్లా పుంగనూరులో నెలకొల్పబోతున్న ఈ యూనిట్ తమకు ప్రపంచంలోనే అతి పెద్ద ప్లాంట్ అని పెప్పర్ మోషన్ వెల్లడించింది. ఎలక్ట్రిక్ బస్సులు, ట్రక్కులతోపాటు స్పేర్ పార్టులు కూడా తయారు చేసి ఇక్కడి నుంచే ఎగుమతి కూడా చేస్తామని ఆ ప్రకటనలో పేర్కొంది.
రూ.4,640 కోట్ల పెట్టుబడితో 8,080 మందికి ఉపాధి
ఈ ప్లాంట్ ఏర్పాటుకు చిత్తూరు జిల్లా పుంగనూరులో రాష్ట్ర ప్రభుత్వం 800 ఎకరాల భూమిని కేటాయించింది. దీంతోపాటు పలు సబ్సిడీలు ఇచ్చింది. సుమారు రూ.4,640 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసే ఈ పరిశ్రమ ద్వారా 8,080 మందికి ఉపాధి లభించనుంది. పరిశ్రమలకు ఏపీ ప్రభుత్వం ప్రోత్సాహం, పారిశ్రామిక మౌలిక వసతులు పెద్ద ఎత్తున సమకూరుస్తుండటంతో తమ యూనిట్‌ను ఏపీలో ఏర్పాటు చేస్తున్నామని పెప్పర్ మోషన్ ఎండీ, సీఈవో ఆండ్రియాస్ హేగర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. వేగంగా పర్మిషన్లు మంజూరు చేయించిన సీఎం జగన్‌కు కృతజ్ఞతలు కూడా తెలిపారు.
టెస్లాలా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో బస్‌లు, ట్రక్‌లు తయారీ
టెస్లా మాదిరిగానే అంతర్జాతీయ ప్రమాణాలతో సమీకృత ఎలక్ట్రిక్ బస్ అండ్ ట్రక్ తయారీ యూనిట్‌ను ఇక్కడ నెలకొల్పబోతున్నారు. దీంతోపాటు డీజిల్ బస్సులు, ట్రక్కులను కూడా ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చే రిట్రో ఫిట్టింగ్, 20 జీడబ్ల్యూహెచ్ సామర్థ్యం ఉండే బ్యాటరీ తయారీ యూనిట్, విడిభాగాల తయారీ యూనిట్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేయనున్నారు. ఈ నెలాఖరులో యూనిట్ నిర్మాణ పనులు ప్రారంభించనున్నట్లు సంస్థ తెలిపింది. 2025 ప్రారంభం నాటికి వాణిజ్యపరంగా ఉత్పత్తి ప్రారంభించాలన్నది సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. 2027 నాటికి ఏటా 50,000 బస్సులు, ట్రక్కులు తయారు చేసే సామర్థ్యానికి యూనిట్ చేరుకుంటుందని వెల్లడించింది. ఎలక్ట్రిక్ వాహనాల విడిభాగాలను కూడా ఇక్కడే ఉత్పత్తి చేసి, అంతర్జాతీయంగా ఎగుమతి చేస్తామని పెప్పర్ మోషన్ ప్రకటించింది.