కన్నీటి అంత్యక్రియలు
మృతుని కుటుంబసభ్యులకు దిక్కుతోచలేదు. గ్రామస్తులు ఊర్లోని ఓ నాటుపడవని సిద్ధంచేసి అందులో మృతదేహాన్ని ఉంచి..ఊరికి దూరంగా వున్న గుట్టవరకూ తరలించి అంత్యక్రియలు నిర్వహించారు.
ఎటుచూసినా నీరు. ఎటూ వెళ్లలేరు. ఏ సర్కారు అధికారంలో ఉన్నా పోలవరం నిర్వాసితులకు ఈ ముంపు ముప్పు తప్పడంలేదు. ఆరోగ్యం క్షీణించినా, ఆపద ముంచుకొచ్చినా ఆ ముంపులోనే. తమ వారు కన్నుమూసినా కన్నీటితో నీటిలోనే సాగుతూ అంత్యక్రియలు చేయాల్సిన దుస్థితి ఏజెన్సీ ప్రాంత పోలవరం ముంపు ప్రాంతాల్లో ఉంది.
అల్లూరి సీతారామరాజు జిల్లా, రంపచోడవరం నియోజకవర్గం చింతరేవుపల్లికి చెందిన గూటల సుబ్బారావు అనారోగ్యం బారిన పడ్డాడు. గోదావరి వరదతో నడిసంద్రంలా మారిన ఊరు, పరిసరాలతో ఆస్పత్రికి వెళ్లలేక ఇంట్లోనే ఉంచేశారు. ఆరోగ్యం క్షీణించి ఇంట్లోనే సుబ్బారావు చనిపోయారు. ఊరంతా నీరుతో నిండిపోవడంతో అంత్యక్రియలకు అవకాశం లేదు. మృతుని కుటుంబసభ్యులకు దిక్కుతోచలేదు. గ్రామస్తులు ఊర్లోని ఓ నాటుపడవని సిద్ధంచేసి అందులో మృతదేహాన్ని ఉంచి..ఊరికి దూరంగా వున్న గుట్టవరకూ తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. ఇళ్లలో నీరు.. ఊరిలో నీరు.. కళ్లలో నీరుతో సుబ్బారావుకి కుటుంబసభ్యుల కన్నీటి నివాళి అర్పించారు.