Telugu Global
Andhra Pradesh

పీపుల్స్ హీరో జగన్.. కుంభకోణాల్లో సూపర్ స్టార్ చంద్రబాబు..

చంద్రబాబు క్రియాశీలక రాజకీయ జీవితం చరమాంకానికి చేరుకున్న దశ ఇది. జగన్‌తో పెట్టుకుంటే ఎలా ఉంటుందో గత కొన్నేళ్లుగా ఆయన అనుభవంలో ఉన్నది.

పీపుల్స్ హీరో జగన్.. కుంభకోణాల్లో సూపర్ స్టార్ చంద్రబాబు..
X

సంక్షేమ పథంలో జగన్ పాలన సరికొత్త విప్లవాన్ని సృష్టించింది. మునుపెన్నడూ లేని రీతిలో వైఎస్ జగన్ హయాంలో పేదల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత లభించింది. విద్య, వైద్యం, వ్యవసాయం, హౌసింగ్ ఇలా అనేక రంగాల్లో పేద వర్గాలకు జగన్ సర్కార్ ఆలంబనగా నిలుస్తోంది. జగన్ చేస్తున్న మంచికి.. మళ్లీ ఆయనకే అధికారం ఇవ్వాలనే భావన అన్ని వర్గాల ప్రజల్లో నెలకొంది. ముఖ్యంగా రాష్ట్ర జనాభాలో అధిక శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు జగన్ చేస్తున్న మేలును ఎప్పటికీ మరిచిపోలేమని అభిప్రాయపడుతున్నారు. ఉచితాలతో రాష్ట్రాన్ని దివాళా తీయించేస్తున్నారని గగ్గోలు పెడుతున్న ప్రత్యర్థి పార్టీలు, జ‌గ‌న్ ప్ర‌భుత్వ వ్య‌తిరేక మీడియా అరుపులను కూడా వారు గమనిస్తున్నారు.

సంక్షేమం అంటే ఏదో తూతూ మంత్రంగా చేతులు దులుపుకోవడం కాదు. జగన్ సర్కార్ అమలుచేస్తున్న నాడు-నేడు, విద్యా దీవెన, రైతు భరోసా వంటి పథకాలు, గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్స్ వంటి వ్యవస్థలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. అటు పథకాల అమలులో, ఇటు వ్యవస్థల నిర్వహణలో ఎక్కడా అవినీతి మకిలీ అంటకుండా జగన్ ముందుకెళ్తున్నారు. పదుల సంఖ్యలో అమలవుతున్న పథకాలు చివరి లబ్ధిదారుడి వరకూ చేరుతున్నాయి. ఈ క్రమంలో ఎక్కడా అవకతవకలు, అక్రమాలకు తావు లేకపోవడం జగన్ ప్రభుత్వ విధానాలను తెలియజేస్తోంది.

గత టీడీపీ హయాంలో ఎన్నెన్నో స్కామ్‌లు జరిగాయి. మజ్జిగ నుంచి మైనింగ్ వరకూ, స్కిల్ స్కామ్ నుంచి సింగపూర్ స్కామ్ వరకూ, ఇసుక స్కామ్, ఇన్‌సైడర్ ట్రేడింగ్ స్కామ్, ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్, కాల్ మనీ సెక్స్ రాకెట్ స్కామ్, గోదావరి పుష్కరాల స్కామ్, సదావర్తి భూముల స్కామ్, పోలవరం స్కామ్.. ఇలా చంద్రబాబు పాలనంతా ప్రజలకు మేలు చేసే మార్గంలో కాకుండా స్కామ్‌లతో తన జేబులు నింపుకునే మార్గంలో సాగింది. 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన చంద్రబాబు.. ఆ కాలంలో దాదాపు రూ.6 లక్షల కోట్ల మేర కుంభకోణాలకు పాల్పడ్డారు. ఇదంతా ప్రజల సొమ్ము. ఎన్ని స్కాములు చేసినా వ్యవస్థలను మేనేజ్ చేస్తూ 'స్టే'లతో విచారణ నుంచి తప్పించుకు తిరుగుతున్నారు చంద్రబాబు.

తన పరిపాలనలో ఏ వర్గాన్ని పెద్దగా పట్టించుకోని చంద్రబాబు.. ఇప్పుడు జగన్ అమలుచేస్తున్న పథకాలకే ఎక్స్‌టెన్షన్ వాగ్దానాలు ఇస్తున్నారు. జగన్ అమలుచేస్తున్న వాటినే ఇంకాస్త ఎక్కువ డబ్బులిచ్చి అమలుచేస్తానని చెబుతున్నారు. సంపద సృష్టిస్తా, పేదోళ్లను సంపన్నులుగా మారుస్తా, పూర్ టు రిచ్ అంటూ ఒక స్పష్టమైన విధానం లేని భ్రమాత్మకతను పలవరిస్తున్నారు.

చంద్రబాబు క్రియాశీలక రాజకీయ జీవితం చరమాంకానికి చేరుకున్న దశ ఇది. జగన్‌తో పెట్టుకుంటే ఎలా ఉంటుందో గత కొన్నేళ్లుగా ఆయన అనుభవంలో ఉన్నది. చంద్రబాబు తన 45 ఏళ్ల రాజకీయ జీవితంలో నేర్వని పాఠాలు, జగన్‌ని ఎదుర్కొనే క్రమంలో నేర్చుకోవాల్సి వస్తున్నది. పాలనలో నన్ను మించినవారు లేరని గొప్పలు పోయే చంద్రబాబు.. నేను జగన్ కన్నా ఎక్కువే చేస్తా, నాకు అవకాశం ఇవ్వండి అంటున్నారే తప్ప.. తాను గతంలో పేదలకు ఏం చేశాడో చెప్పలేకపోతున్నాడు. విజనరీ అంటూ అనుకూల మీడియాతో ప్రచారం చేయించుకునే బాబుకు ఇప్పుడు జగన్‌ను ఢీకొట్టే విజన్ తెలియట్లేదు. ఎన్నికల సమరంలో విజేతలు ఎవరైనా కావొచ్చు.. కానీ ప్రజల మనసు తెలిసి పాలించినవారే.. జనం గుండెల్లో నిలిచిపోతారు. ఈ లెక్కన జగన్-చంద్రబాబులను పోలిస్తే.. బాబు స్థానం ఎక్కడో అట్టడుగున ఉంటుంది. రేపు రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఈ విషయాన్ని మరింత స్పష్టంగా చెప్పబోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.

First Published:  4 May 2024 5:31 PM IST
Next Story