Telugu Global
Andhra Pradesh

ఇది... `విజన్ 2047` గ్రౌండ్ రియాలిటీ

చంద్రబాబు తన విజన్ 2047 గురించి అనర్గళంగా దాదాపు గంటన్నరసేపు ఉపన్యాసం దంచికొట్టారు. చంద్రబాబు ఏమిచెప్పారన్న విషయాన్ని పక్కనపెట్టేస్తే కనీసం తమ్ముళ్ళు హాజ‌రైనా సదస్సులో జనాలు కనిపించేవారు.

ఇది... `విజన్ 2047` గ్రౌండ్ రియాలిటీ
X

ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడుకి మీడియాలో ఉన్న అపారమైన మద్దతు గురించి ఎవరికీ ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇన్ని సంవత్సరాల నుండి ఆయనకంటూ సొంత బలం లేకపోయినా విజయవంతంగా నెట్టుకొస్తున్నారంటే అందుకు కారణం మీడియా బలమే. మొసలికి నీటిలో ఎంత బలముంటుందో చంద్రబాబు మీడియా బలం అలాంటిదే. చంద్రబాబు నిర్వహించే చిన్న ప్రోగ్రాములను కూడా బూతద్దంలో చూపించటమే ఎల్లో మీడియా లక్ష్యం. ఇదే సమయంలో ప్రత్యర్థుల సభలు ఎంత సక్సెస్ అయినా ఫెయిలైనట్లుగా చూపించటం మామూలే.

ఇపుడిదంతా ఎందుకంటే వైజాగ్ చంద్రబాబు 2047 అనే డాక్యుమెంట్‌ను రిలీజ్ చేశారు. ఆయన విజన్ చాలామందికి ఏమాత్రం అర్థం కాదు. పైగా ప్రతిపక్షంలో ఉన్నపుడు రిలీజ్ చేసే, చెప్పే విజన్ అధికారంలో ఉన్నపుడు చంద్రబాబు ఆచరించరు. సరే ఆ విషయాన్ని పక్కనపెట్టేస్తే వైజాగ్ బీచ్ రోడ్డులో ఎన్టీయార్ విగ్రహం నుండి 2 కిలోమీటర్లు వాక్ చేశారు. తర్వాత ఒక సదస్సు కూడా నిర్వహించారు. విషయం అంతా ఇక్కడే ఉంది. అదేమిటంటే వాక్‌లో కనిపించిన తమ్ముళ్ళు తర్వాత సదస్సులో ఎక్కడా కనబడలేదు.

వాక్‌లో ఎంతమంది పాల్గొన్నారో తెలీదు కానీ ఎల్లో మీడియా మాత్రం బీభత్సంగా జనాలు పాల్గొన్నట్లు ఫొటోలు వేసింది. అది నిజమే అనుకుంటే మరి తర్వాత జరిగిన సదస్సులో జనాలు ఎందుకు లేరు? సదస్సులో పట్టుమని రెండు వందల మంది కూడా ఉండుండరు. అందుకనే ఎల్లో మీడియా ఎక్కడ కూడా సదస్సులో పాల్గొన్న జనాల ఫొటోలు వేయలేదు.

చివరకు టీడీపీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో కూడా చంద్రబాబు మాట్లాడుతున్న వేదికను కవర్ చేశారే కానీ జనాలను మాత్రం చూపలేదు. ఎవరో ఒక మహిళ చంద్రబాబును ప్రశ్నించినపుడు మాత్రం జనాలను చూపించారు. అప్పుడు ఒక పది మంది ఉంటే ఎక్కువ. అంటే జనాలు లేకుండానే చంద్రబాబు తన విజన్ 2047 గురించి అనర్గళంగా దాదాపు గంటన్నరసేపు ఉపన్యాసం దంచికొట్టారు. చంద్రబాబు ఏమిచెప్పారన్న విషయాన్ని పక్కనపెట్టేస్తే కనీసం తమ్ముళ్ళు హాజ‌రైనా సదస్సులో జనాలు కనిపించేవారు. ఇంతోటిదానికి ఎల్లో మీడియా పార్టీ నేతలతో పాటు మేధావులు చాలామంది సదస్సుకు హాజరైనట్లు బిల్డప్ ఇవ్వటమే కొసమెరుపు.

First Published:  17 Aug 2023 11:00 AM IST
Next Story