ప్రజలు చంద్రబాబు మాయలో పడొద్దు - ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు
టీడీపీ నేతలు ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పారు. ఒక్క అమరావతినే రాజధాని చేయాలనడం వెనుక దురుద్దేశం ఉందన్నారు.
ప్రజలు చంద్రబాబు మాయలో పడొద్దని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు సూచించారు. టీడీపీ నేతలు ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని ఆయన చెప్పారు. ఒక్క అమరావతినే రాజధాని చేయాలనడం వెనుక దురుద్దేశం ఉందన్నారు. శ్రీకాకుళంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి ధర్మాన మాట్లాడారు.
ఒక్కచోటే అభివృద్ధి అనేది సరికాదని, శివరామకృష్ణన్ కమిటీ కూడా అదే చెప్పిందని మంత్రి ధర్మాన గుర్తు చేశారు. 65 ఏళ్ల పాటు మనమంతా కలిసి హైదరాబాద్‌ను అభివృద్ధి చేశామని, అప్పట్లోనే ఉమ్మడి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలనూ అభివృద్ధి చేసి ఉంటే.. అసలు రాష్ట్ర విభజనే జరిగేది కాదని మంత్రి చెప్పారు. ఇప్పుడైనా ఒక్క అమరావతినే అభివృద్ధి చేస్తే మళ్లీ అలాంటి పరిస్థితి రాదా అని ఆయన ప్రశ్నించారు. అమరావతిలో రాజధాని వద్దని వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం చెప్పడం లేదని, అన్ని ప్రాంతాల అభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ విధానమని ధర్మాన స్పష్టం చేశారు. అమరావతి శాసన రాజధానిగా ఉంటుందని చెప్పారు. ఒకే ప్రాంతంలో అభివృద్ధి చేయాలనే విధానాన్ని ప్రపంచమే అంగీకరించడం లేదని ఆయన గుర్తు చేశారు.
హైదరాబాద్ విషయంలో జరిగిన తప్పు మళ్లీ జరగనీయొద్దని ధర్మాన చెప్పారు. 4 నుంచి 5 లక్షల కోట్ల రూపాయలతో అమరావతిలో అభివృద్ధి సాధ్యమయ్యే పనేనా అని ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు అభివృద్ధి చెందవద్దా అంటూ నిలదీశారు. ఒక్కచోటే అన్నీపెట్టి మా పీక కోస్తామంటే.. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలు ఊరుకుంటారా అని ప్రశ్నించారు. మా ప్రజలు ఎప్పటికీ కూలీలుగానే ఉండాలా అని నిలదీశారు. సంపద కొద్దిమంది చేతిలోనే ఉండాలనడాన్ని తాము అంగీకరించబోమని ఆయన స్పష్టం చేశారు. టీడీపీ నేతలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటుంటే.. మేము చప్పట్లు కొట్టాలా? అని మంత్రి ధర్మాన నిలదీశారు.