చంద్రబాబు, పవన్ ఇద్దరూ ఫెయిలయ్యారా?
పవన్ కల్యాణ్, చంద్రబాబు పదేపదే వలంటీర్, సచివాలయ వ్యవస్థల మీద ఎంతగా ఆరోపణలు చేస్తున్నా, బురదచల్లుతున్నా జనాల నుండి మద్దతు దొరకటంలేదు.

కొన్నింటికి ముహూర్తాలు చాలా బలంగా ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ఏ ముహూర్తంలో వలంటీర్, సచివాలయ వ్యవస్థలను ఏర్పాటు చేశారో అవి రెండు జనాల మనసుల్లో బలంగా నాటుకుపోయాయి. అందుకనే పవన్ కల్యాణ్, చంద్రబాబునాయుడు పదేపదే పై రెండు వ్యవస్థల మీద ఎంతగా ఆరోపణలు చేస్తున్నా, బురదచల్లుతున్నా జనాల నుండి మద్దతు దొరకటంలేదు. పవన్ మాట్లాడుతూ.. హ్యూమన్ ట్రాఫికింగ్‌కు వలంటీర్లే కారణమన్నారు.
చంద్రబాబు మాట్లాడుతూ.. వలంటీర్లు కొంపలు కూల్చేస్తున్నారని, ఇళ్ళల్లో మగవాళ్ళు లేనప్పుడు ఇంటికి వెళ్ళి వలంటీర్లు తలుపులు ఎందుకు తడుతున్నారంటు మాట్లాడారు. నిజానికి ఈ రెండు కూడా తప్పుడు ఆరోపణలే. ఎందుకంటే వలంటీర్ల ద్యారా హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతోందనే పవన్ ఆరోపణలపై రాష్ట్రంలో ఐదు రోజులుగా గోల గోల జరుగుతోంది. పవన్ ఆరోపణలు నిజమే అయితే హ్యూమన్ ట్రాఫికింగ్‌కు గురైన ఆడవాళ్ళ కుటుంబాలు బయటకు రాకుండా ఉంటారా? ఈ పాటికే పవన్ ఆరోపణలకు మద్దతుగా జనాలు ఇళ్ళల్లో నుండి బయటకు వచ్చేవారే కదా.
చంద్రబాబు ఆరోపణలు నిజమే అని, వలంటీర్ల వల్ల తమ కుటుంబాల్లో చిచ్చు మొదలైందని జనాలు రోడ్ల మీదకు వచ్చేవారే. కానీ పవన్, చంద్రబాబు ఆరోపణలను జనాలు పట్టించుకోవటం లేదంటే ఏమిటర్థం? వాళ్ళిద్దరూ గాలిని పోగేసి ఆరోపణలు చేస్తున్నట్లే కదా. అసలు వలంటీర్, సచివాలయ వ్యవస్థలు ఎందుకు? అని పవన్ అడగటమే విచిత్రంగా ఉంది. ఇక్కడే తన అజ్ఞానం బయటపడింది. ఎంఆర్వో, మున్సిపల్, విద్యుత్ తదితర శాఖలో పని చేయించుకోవాలంటే ఒక మామూలు వ్యక్తి ఎన్నిరోజులు వాళ్ళు చుట్టూ తిరగాలో పవన్‌కు తెలుసా?
పెన్షన్ కావాలన్నా, రేషన్ కావాలన్నా పేదలు రెవెన్యూ, డీలర్ల చుట్టూ ఎన్నిసార్లు తిరుగుతారో తెలిస్తే పవన్ నోరెత్తరు. కరోనా సమయంలో ఎవరిళ్ళల్లో వాళ్ళు తలుపులేసుకున్నపుడు, టీకాలు వేయించుకోవాలంటే వలంటీర్లు చేసిన సాయాన్ని జనాలు మరచిపోలేరు. ఇప్పుడు మామూలు జనాలు తమకు ఏ అవసరమైనా వెంటనే సచివాలయాలకు వెళ్ళి దరఖాస్తును ఇచ్చేస్తే మొత్తం పనంతా వలంటీర్లే చేసేస్తున్నారు. జనాలకు ప్రభుత్వాఫీసుల్లో పనులు స్పీడుగా అవుతున్నాయంటే వలంటీర్లు, సచివాలయ వ్యవస్థ బాగా పనిచేస్తుండటమే కారణం. బహుశా ఇదే చంద్రబాబు, పవన్‌లో భయాన్ని పెంచుతున్నాయేమో. అందుకనే వలంటీర్, సచివాలయ వ్యవస్థలపై బురద చల్లేస్తున్నారు. జనాల మద్దతు దొరకటం లేదు కాబట్టే వాళ్ళిద్దరు ఫెయిలైనట్లు అర్థమైపోతోంది.