రెండో జాబితా విడుదలైతే చూడాలి
గోరంట్ల బుచ్చయ్యచౌదరి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, బొడ్డు వెంకటరమణచౌదరి, యరపతినేని శ్రీనివాసరావు, దేవినేని ఉమ, బండారు శ్రీనివాసమూర్తి, గంటా శ్రీనివాసరావు, కళావెంకటరావు, గౌతు శిరీష లాంటి సుమారు 30 మందికి టికెట్లు దక్కేది అనుమానమే.
తెలుగుదేశం పార్టీ-జనసేన కూటమిలో పోటీచేయబోయే అభ్యర్థుల రెండోజాబితా విడుదలైతే చూడాలి తమ్ముళ్ళ వీరంగాలు. మొదటిజాబితా విడుదలచేసి చాలా రోజులైనా ఇప్పటివరకు రెండోజాబితాను చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ విడుదల చేయలేకపోయారు. మొదటిజాబితా విడుదలతోనే రెండు పార్టీల్లో నానా గొడవలవుతున్నాయి. వాటిని సర్దుబాటు చేయలేక ఇద్దరు అధినేతలు నానా అవస్థలు పడుతున్నారు. వైసీపీ 8 జాబితాలను విడుదల చేసినప్పుడు టికెట్లు దక్కని ఎమ్మెల్యేల్లో కొందరు అసంతృప్తి వ్యక్తంచేశారు. దాదాపు 24 మందికి టికెట్లు దక్కకపోతే అందులో పార్టీమారింది ఆరుగురు ఎమ్మెల్యేలు మాత్రమే.
మిగిలిన వారిలో ఇద్దరు ముగ్గురు అప్పట్లో కోపంతో మాట్లాడినా తర్వాత జగన్మోహన్ రెడ్డికి సారీ చెప్పుకుని పార్టీలో కంటిన్యూ అవుతున్నారు. అలాగే నియోజకవర్గాలు మారిన ఎమ్మెల్యేలు ఇద్దరు ముగ్గురు అసంతృప్తి వ్యక్తం చేసినా మాజీ మంత్రి గుమ్మనూరు జయరామ్ మాత్రమే టీడీపీలో చేరారు. మొత్తంమీద టికెట్లు దక్కనివారిని, నియోజకవర్గాలు మారినవారిని జగన్ పైకి రెచ్చగొట్టేందుకు చంద్రబాబు అండ్ కో, ఎల్లోమీడియా ఎంత ప్రయత్నించినా పెద్దగా సక్సెస్ దొరకలేదు. అదే సమయంలో చంద్రబాబు, పవన్ విడుదలచేసిన ఒక్కజాబితాకే నేతల ఆగ్రహాన్ని తట్టుకోలేక చంద్రబాబు, పవన్ తల్లకిందులైపోతున్నారు.
గోరంట్ల బుచ్చయ్యచౌదరి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, బొడ్డు వెంకటరమణచౌదరి, యరపతినేని శ్రీనివాసరావు, దేవినేని ఉమ, బండారు శ్రీనివాసమూర్తి, గంటా శ్రీనివాసరావు, కళావెంకటరావు, గౌతు శిరీష లాంటి సుమారు 30 మందికి టికెట్లు దక్కేది అనుమానమే. దాంతో వాళ్ళ ఆగ్రహాన్ని చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు. అనంతపురం జిల్లాలో నాలుగు నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చాల్సిందే అని తమ్ముళ్ళు గోలగోలచేస్తున్నారు. పార్టీ ఆఫీసుల మీదకు దాడులుచేశారు. చంద్రబాబు, లోకేష్ కటౌట్లను తగలబెట్టేశారు. తమ్ముళ్ళ ఆగ్రహం దెబ్బకు చంద్రబాబు, లోకేష్ ఫోన్లో కూడా దొరకటంలేదట.
జనసేన అభ్యర్థులను ప్రకటించిన ఐదింటిలో మూడు నియోజకవర్గాల్లో గోలగోల జరుగుతోంది. చంద్రబాబు ప్రకటించాల్సిన 57 నియోజకవర్గాలు, పవన్ ప్రకటించాల్సిన 19 నియోజకవర్గాలను కూడా ప్రకటిస్తే అప్పుడు మొదలవుతుంది అసలు సినిమా. మధ్యలో పొత్తులో బీజేపీ కూడా చేరితే వీళ్ళపని అంతే సంగతులు. వైసీపీలో లుకలుకలు, తిరుగుబాట్లు, ఆగ్రహాలు, మంటలు అని ఎల్లోమీడియా కథనాలు రాయటం కాదు టీడీపీ-జనసేన-బీజేపీలో ఏమి జరుగుతుందో రాస్తే భలేగుంటుంది.