ప్రాణహాని విషయంలో కూడా అయోమయమేనా?
తనను హతమార్చటానికి కిరాయి హంతకులకు సుపారీ ఇచ్చినట్లు కచ్చితమైన సమాచారం ఉందని పవన్ అన్నారు. అయితే వైసీపీ మీద పవన్ ఇంతపెద్ద ఆరోపణ చేసినా జనాల్లో పెద్దగా చర్చ జరగటంలేదు. పైగా దీన్ని పెద్ద జోక్‌గా చర్చించుకుంటున్నారు.
ఎంత అమాయక చక్రవర్తయినా తనకు ఎవరి నుండి హాని జరుగుతుంది అనే విషయంలో క్లారిటితో ఉంటాడు. తనను భయపెడుతున్నది ఎవరనే విషయంలో చాలా స్పష్టంగా ఉంటాడు. అలాంటిది జనసేన అధినేత పవన్ కల్యాన్ మాత్రం ఈ విషయంలో పూర్తిగా అయోమయంలో ఉన్నారు. నిజంగానే పవన్‌కు ప్రాణహాని ఉందో లేదో తెలియదు కానీ, ఉందని చెప్పటం పెద్ద జోక్‌గా అయిపోయింది. ఎందుకంటే ఎవరి నుండి ప్రాణహాని ఉందనే విషయంలో కూడా ఒక్కోసారి ఒక్కోవిధంగా మాట్లాడటమే కారణం.
వారాహి యాత్రలో పవన్ మాట్లాడుతూ.. వైసీపీ గుండాల నుండి తనకు ప్రాణహాని ఉందన్నారు. తనను హతమార్చటానికి కిరాయి హంతకులకు సుపారీ ఇచ్చినట్లు తనకు కచ్చితమైన సమాచారం ఉందన్నారు. అయితే వైసీపీ మీద పవన్ ఇంతపెద్ద ఆరోపణ చేసినా జనాల్లో పెద్దగా చర్చ జరగటంలేదు. పైగా దీన్ని పెద్ద జోక్‌గా చర్చించుకుంటున్నారు. హత్యకు సుపారీ అన్న విషయాన్ని జనాలు పెద్దగా సీరియస్‌గా తీసుకోకపోయినా చర్చయితే జరుగుతోంది.
జనాలు ఎందుకు సీరియస్‌గా తీసుకోలేదంటే అందుకు పవనే కారణం. ఎలాగంటే టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నికల సమయంలో మాట్లాడుతూ.. చంద్రబాబునాయుడు, లోకేష్ నుండి తనకు ప్రాణహాని ఉందన్నారు. తనను హత్య చేయటానికి తండ్రి, కొడుకులు సుపారీ ఇచ్చి గ్యాంగులను రంగంలోకి దింపారని అప్పట్లో కూడా ఆరోపించారు. అప్పట్లో చంద్రబాబు అధికారంలో ఉన్నారు కాబట్టి చంద్రబాబు, లోకేష్ పైన ఆరోపణలు చేశారు.
తర్వాత అదే చంద్రబాబుతో చేతులు కలిపారు. మళ్ళీ ఇంతకాలానికి జగన్మోహన్ రెడ్డిపైన అలాంటి ఆరోపణలే చేశారు. అప్పట్లో చంద్రబాబు అధికారంలో ఉంటే చంద్రబాబు మీద, ఇప్పుడు జగన్ అధికారంలో ఉన్నారు కాబట్టి జగన్ మీద హత్యకు ప్లాన్ చేశారని ఆరోపణ చేశారు. తన హత్యకు చంద్రబాబు, జగన్‌లో ఎవరు సుపారీ ఇచ్చారనే విషయంలో కూడా పవన్ ఇంతటి అయోమయం ఉండటమే ఆశ్చర్యంగా ఉంది. అసలింతకు పవన్ హత్యకు సుపారీ ఇచ్చి గ్యాంగులను దింపింది ఎవరు? హత్యకు సుపారీ ఇచ్చింది నిజమేనా అన్నదే జనాలకు అర్థంకావటంలేదు.