Telugu Global
Andhra Pradesh

వారికి ఇంటి వద్దే పెన్షన్.. మార్గదర్శకాలు విడుదల

పెన్షన్ల పంపిణీ కోసం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు సచివాలయాలు పనిచేస్తాయి. సచివాలయ సిబ్బందికి ఇప్పటికే విధులు కేటాయించారు.

వారికి ఇంటి వద్దే పెన్షన్.. మార్గదర్శకాలు విడుదల
X

ఏపీలో సామాజిక పెన్షన్ల పంపిణీ వ్యవహారంపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో పెన్షన్ల పంపిణీ జరుగుతుందని ఇదివరకే ప్రకటించినా ఇప్పుడు పూర్తి స్థాయి మార్గదర్శకాలు విడుదల చేశారు. సచివాలయ సిబ్బంది పెన్షన్ల పంపిణీ లో పాల్గొంటారు. రేపు బుధవారం (ఏప్రిల్‌3) నుంచి పెన్షన్ల పంపిణీ మొదలవుతుంది. శనివారం (ఏప్రిల్ 6) పెన్షన్ల పంపిణీకి చివరి రోజు.

పెన్షన్ల పంపిణీ ప్రతినెలా వాలంటీర్ల ద్వారా జరుగుతుంది. అయితే టీడీపీ ఆధ్వర్యంలో కోర్టు కేసులతోపాటు, ఈసీకి ఫిర్యాదులు అందడంతో వాలంటీర్లను ఆ విధులకు దూరం పెట్టారు. ఇంటి వద్దకే పెన్షన్ కాస్తా, సచివాలయంలో పెన్షన్ గా మారింది. మొత్తం మూడు నెలలపాటు ఇదే విధానం కొనసాగుతుంది. దీనికోసం తాజాగా మార్గదర్శకాలు విడుదలయ్యాయి.

పెన్షన్ల పంపిణీ కోసం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు సచివాలయాలు పనిచేస్తాయి. సచివాలయ సిబ్బందికి ఇప్పటికే విధులు కేటాయించారు. ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.27 లక్షల సిబ్బంది పనిచేస్తున్నారు. వీరంతా పెన్షన్ల పంపిణీ కోసం అందుబాటులో ఉంటారు.

దివ్యాంగులు, రోగులకు మినహాయింపు..

వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక రోగాలతో బాధపడేవారు, పలు ఇతర కేటగిరీల వారు సామాజిక పెన్షన్లు తీసుకుంటున్నారు. వీరందరికీ ప్రతి నెలా ఒకటో తేదీన ఇంటికి వెళ్లి వాలంటీర్లు పెన్షన్ డబ్బులు ఇచ్చేవారు. ఇకపై మూడు నెలలపాటు వీరంతా సచివాలయానికి వెళ్లి పెన్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి. అయితే వికలాంగులు, తీవ్ర అనారోగ్యంతో ఉన్నవారికి మాత్రం మినహాయింపు ఇచ్చారు అధికారులు. వారికి మాత్రం సచివాలయ సిబ్బంది ఇంటి దగ్గరకే వెళ్లి పెన్షన్‌ ఇస్తారు.

First Published:  2 April 2024 6:22 PM IST
Next Story