Telugu Global
Andhra Pradesh

పింఛన్ డబ్బులో నకిలీ నోట్లా?

పింఛన్ పంపిణీ చేసేందుకు అవసరమైన డబ్బులను ఆరుగురు వలంటీర్లు ఒకే బ్యాంకు నుండే తీసుకున్నారు. అయితే ఆమోస్ పంపిణీ చేసిన పింఛన్లోనే నకిలీనోట్లు బయటపడ్డాయి. పోలీసులు గట్టిగా అడిగేటప్పటికి నకిలీనోట్లను తానే పంపిణీ చేసినట్లు అంగీకరించారు.

పింఛన్ డబ్బులో నకిలీ నోట్లా?
X

జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న నవరత్నాల్లో సామాజిక పింఛన్ల కార్యక్రమం ఒకటి. వృద్ధులు, ఒంటరి మహిళలు, వితంతువులకు నెలకు రూ. 2750 అందిస్తున్నారు. రూ. 2500 పెన్షన్ కు రూ. 250 కలిపి జనవరి 1వ తేదీ నుండి రూ. 2750ని లబ్దిదారులకు ప్రభుత్వం అందించింది. ఇంతటి ప్రతిష్టాత్మకమైన కార్యక్రమంలో లబ్దిదారుల అమాయకత్వాన్ని కొందరు వ‌లంటీర్లు అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు.

ఇందులో భాగంగానే ప్రకాశం జిల్లాలోని ఒక విలేజ్‌లో రూ. 19 వేల విలువైన 500 రూపాయల నకిలీనోట్ల పంపిణీ జరిగింది. విషయం బయటపడటంతో ఇప్పుడు రాష్ట్రమంతా ఇదే విషయమై చర్చ జరుగుతోంది. ఇంతకీ జరిగింది ఏమిటంటే జిల్లాలోని ఎర్రగొండపాలెం మండలంలోని నరసాయపాలెం గ్రామంలో వలంటీర్లు పింఛన్లు పంపిణీ చేశారు. ఈ గ్రామంలో మొత్తం ఆరు మంది పింఛన్లు పంచారు. వీరిలో ముటుకూరి ఆమోస్‌ పంపిణీ చేసిన పింఛన్ డబ్బులో నకిలీ నోట్లు బయటపడ్డాయి.

పింఛన్ అందుకున్న వాళ్ళల్లో ఒకళ్ళు షాపుకు వెళ్ళి సరుకులు కొన్నపుడు అక్కడ నకిలీ నోటును గుర్తించారు. వెంటనే ఈ విషయం ఆనోటా ఈనోటా పింఛన్ అందుకున్నవాళ్ళకు, పంపిణీ చేస్తున్న వలంటీర్ల దృష్టికి వెళ్ళింది. వెంటనే ఆమోస్ పంపిణీ చేసిన పింఛన్ల డబ్బును తనిఖీ చేసినపుడు ఏడుగురికి ఇచ్చిన పింఛన్ డబ్బులో 38 నకిలీ నోట్లను గుర్తించారు. వెంటనే ఈ విషయాన్ని వలంటీర్లు ఉన్నతాధికారులకు చేరవేశారు. దాంతో అధికారులు రంగంలోకి దిగి బ్యాంకు అధికారులతో మాట్లాడారు.

పింఛన్ పంపిణీ చేసేందుకు అవసరమైన డబ్బులను ఆరుగురు వలంటీర్లు ఒకే బ్యాంకు నుండే తీసుకున్నారు. అయితే ఆమోస్ పంపిణీ చేసిన పింఛన్లోనే నకిలీనోట్లు బయటపడ్డాయి. దాంతో వెంటనే ఆమోస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదుచేశారు. పోలీసులు గట్టిగా అడిగేటప్పటికి నకిలీనోట్లను తానే పంపిణీ చేసినట్లు అంగీకరించారు. ఆమోస్‌కు సహకరించిన మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. మొత్తానికి పింఛన్ డబ్బులో నకిలీ నోట్లు ఉన్నాయనే విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

First Published:  2 Jan 2023 11:56 AM IST
Next Story