తిట్టేవాళ్లకే వైసీపీ టిక్కెట్లా..? ఎంతవరకు నిజం..?
పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి తాజాగా ఇదే విషయంలో వైసీపీని, జగన్ ని టార్గెట్ చేశారు. ప్రతిపక్షాలపై దౌర్జన్యాలు చేయకపోవడం, అసభ్య పదజాలం వాడకపోవడమే తన అసమర్థత అన్నారు.
"పక్కపార్టీ వాళ్లని తిట్టలేదనే కారణంతోనే నాకు టికెట్ నిరాకరించారు.." ఇటీవల కాలంలో వైసీపీ అసంతృప్తుల నోట వినిపిస్తున్న మాట ఇది. ప్రతిపక్ష పార్టీల వాళ్లని కాస్త బలంగా తిట్టాలంటూ ఐప్యాక్ టీమ్ తో ఎమ్మెల్యేలకు సందేశాలు వెళ్తున్నాయనే పుకారు కూడా ఉంది. అయితే ఇందులో ఎంత నిజం ఉందనేది ఇప్పుడు తేలాల్సింది. ఇప్పటి వరకు మూడు లిస్ట్ లు విడుదల చేశారు సీఎం జగన్. అందులో తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి వంటి సౌమ్యులు చాలామందే ఉన్నారు. ప్రతిపక్షాల పేరెత్తని కొత్త నేతలు కూడా ఉన్నారు. అంతమాత్రాన వారికి టికెట్ లేకుండా పోయిందా..? ప్రతిపక్షాలను తిట్టడమే ఎమ్మెల్యే టికెట్ ప్రధాన అర్హత అని వైసీపీ నేతలు ఎందుకు ఫీలవుతున్నారు..?
పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి తాజాగా ఇదే విషయంలో వైసీపీని, జగన్ ని టార్గెట్ చేశారు. ప్రతిపక్షాలపై దౌర్జన్యాలు చేయకపోవడం, అసభ్య పదజాలం వాడకపోవడమే తన అసమర్థత అన్నారు. అందుకే తనకు వైసీపీలో టికెట్ దక్కలేదన్నారు. పార్టీ కచ్చితంగా ఓడిపోతుందనుకున్న గన్నవరం సీటు తనకు ఇవ్వాలనుకున్నారని, కానీ తాను వద్దనడం వల్లే అసలు టికెట్ లేకుండా చేశారన్నారు. వైసీపీలో బీసీలను అణగదొక్కుతున్నారని మండిపడ్డారు. టికెట్ దక్కని పార్థసారథి వైసీపీపై తిరగబడటంలో విశేషం లేదు, కానీ పక్క పార్టీలను తిట్టకపోవడం వల్లే తనకు టికెట్ నిరాకరించారని చెప్పడమే ఇక్కడ విశేషం. అందులోనూ ప్రతిపక్షాలపై విమర్శలతో విరుచుకుపడే మంత్రి జోగి రమేష్ కి పెనమలూరు టికెట్ దక్కడంతో పార్థసారథి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
తిట్టనివాళ్లకు కూడా టికెట్లు..
పార్థసారథి చెప్పినా, మరొకరు ఆరోపించినా.. వైసీపీ వరుస చూస్తుంటే తిట్టేవారికి మాత్రమే టికెట్లు అని జగన్ గిరిగీసినట్టు ఎక్కడా కనపడదు. మంత్రి అమర్నాథ్, ఎంపీ గోరంట్ల మాధవ్.. ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగా, అలాంటి వారిని కూడా జగన్ పక్కనపెట్టారు. అంటే.. తిట్లే క్రైటీరియా అనేది అవాస్తవం అని చెప్పాలి. రాగాపోగా జగన్ మాత్రం గెలుపు క్రైటీరియా ఒక్కటే చూస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఆయన అంచనాలు, ఐప్యాక్ సర్వేలు ఏమేరకు నిజమవుతాయనేది ముందు ముందు తేలిపోతుంది.