Telugu Global
Andhra Pradesh

పెనమలూరు చెత్త నూజివీడులో బంగారమైందా..?

అప్పట్లో వంగలపూడి అనిత, కేఎస్ జవహర్ లను నియోజకవర్గాలు మార్చి పోటీచేయించిన విషయం అందరికీ తెలిసిందే. అయినా సరే జగన్ను పట్టుకుని నోటికొచ్చింది మాట్లాడుతున్నారు.

పెనమలూరు చెత్త నూజివీడులో బంగారమైందా..?
X

రాబోయే ఎన్నికల్లో గెలుపుకోసం జగన్మోహన్ రెడ్డి పెద్ద కసరత్తే చేస్తున్నారు. ఇందులో భాగంగానే కొందరు ఎమ్మెల్యేలకు నియోజకవర్గాలను మారుస్తున్నారు. దానిపై చంద్రబాబునాయుడు పెద్దఎత్తున ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారు. ఎమ్మెల్యేల‌కు నియోజకవర్గాలను మార్చటంపై ఎల్లోమీడియా కూడా బాగా నెగిటివ్‌గా కథనాలు ఇస్తోంది. అధికారులకు బదిలీలు ఉంటాయని తెలుసు కానీ, ఎమ్మెల్యేలు, మంత్రులను బదిలీలుచేయటాన్ని ఇప్పుడే చూస్తున్నాను అంటూ చంద్రబాబు పదేపదే ఎగతాళి చేస్తున్నారు. ఒక నియోజకవర్గంలో చెత్తను తీసుకెళ్ళి ఇంకో నియోజకవర్గంలో పడేస్తే బంగారం అవుతుందా..? అంటూ సెటైర్లు వేస్తున్నారు.

సీన్ కట్ చేస్తే.. చంద్రబాబు కూడా ఇప్పుడు అదే పనిచేశారు. నిజానికి 2019లోనే చంద్రబాబు ఎమ్మెల్యేల‌ను బదిలీచేశారు. అయితే తాను చేస్తే సంసారం ఎదుటివాళ్ళు చేస్తే మ‌రేటో అనే పద్దతి చంద్రబాబుది. అప్పట్లో వంగలపూడి అనిత, కేఎస్ జవహర్ లను నియోజకవర్గాలు మార్చి పోటీచేయించిన విషయం అందరికీ తెలిసిందే. అయినా సరే జగన్ను పట్టుకుని నోటికొచ్చింది మాట్లాడుతున్నారు. ఇప్పుడు విషయం ఏమిటంటే.. వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థ‌సారధికి పెనమలూరులో టికెట్ ఇవ్వటానికి జగన్ నిరాకరించారు.

దాంతో అలిగిన పార్థ‌సారధి టీడీపీకి దగ్గరయ్యారు. చంద్రబాబుతో రెండుసార్లు భేటీఅయిన తర్వాత పెనమలూరులో టికెట్ ఇవ్వటానికి అంగీకరించారు. వెంటనే పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ గట్టిగా తగులుకున్నారు. ఐదేళ్ళు తాను పార్టీకోసం కష్టపడి పనిచేస్తే చివరి నిమిషంలో వైసీపీ ఎమ్మెల్యేని చేర్చుకుని టికెట్ ఇస్తే తాను ఒప్పుకోనని చంద్రబాబుకే వార్నింగిచ్చారు. పార్థ‌సారధికి టికెట్ ప్రకటించిన తర్వాత ఏమి జరుగుతుందో చూడండని చంద్రబాబునే హెచ్చరించారు.

దాంతో భయపడిన చంద్రబాబు వైసీపీ ఎమ్మెల్యేకి పెనమలూరు కాకుండా నూజివీడులో టికెట్ ఇస్తున్నట్లు చెప్పారు. తనకు నూజివీడు వద్దని పెనమలూరులోనే పోటీచేస్తానని కొలుసు పట్టుబట్టారు. పోటీచేస్తే నూజివీడులో చేయాలని లేకపోతే లేదని చంద్రబాబు చెప్పేశారట. దాంతో ఏమిచేయాలో కొలుసుకు ఇప్పుడు అర్థంకావటంలేదు. పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యేని పార్టీలో చేర్చుకుని నూజివీడులో పోటీచేయించటాన్ని ఏమంటారో చంద్రబాబే చెబితే బాగుంటుంది..? చంద్రబాబు దృష్టిలో పెనమలూరులో చెత్త నూజివీడులో బంగారమైపోయిందా..?

First Published:  29 Jan 2024 10:52 AM IST
Next Story