Telugu Global
Andhra Pradesh

ఏపీ కాంగ్రెస్‌లోకి షర్మిల ఎంట్రీ..

షర్మిల రాకతో పార్టీకి పూర్వవైభవం వస్తుందని హస్తం పార్టీ నేతలు ఆశలు పెట్టుకున్నారు. అయితే పూర్వవైభవం ఎలా వస్తుందో మాత్రం చెప్పలేకపోతున్నారు.

ఏపీ కాంగ్రెస్‌లోకి షర్మిల ఎంట్రీ..
X

ఏపీ కాంగ్రెస్‌లోకి వైఎస్ షర్మిల అడుగుపెడుతున్నారా..? అడుగుపెట్టడం ఖాయమైతే ఏ హోదాలో వస్తున్నారు..? ఆమె వల్ల ఎవరికి లాభం..? ఎవరికి నష్టమనే చర్చలు మొదలయ్యాయి. దీనికి కారణం ఏమిటంటే.. పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు చేసిన ప్రకటనే. వైఎస్సార్ కూతురు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ తరపున ఏపీ రాజకీయాల్లో అడుగుపెట్టబోతున్నట్లు రుద్రరాజు ప్రకటించారు. అధ్యక్షుడి ప్రకటనతో ఒక్కసారిగా కలకలం మొదలైంది. ఎందుకంటే.. ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది.

2014లో రాష్ట్ర విభజన కారణంగా గడచిన రెండు ఎన్నికల్లో జనాలు పార్టీని తవ్వి పాతరేశారు. కాబట్టి ఇప్పటికిప్పుడు షర్మిల వచ్చినా.. ఇంకొకళ్ళు వచ్చినా కాంగ్రెస్ అద్భుతాలు చేసేస్తుందని ఎవరు అనుకోవటంలేదు. కాకపోతే అన్నీ పార్టీల్లోనూ ఎంతోకొంత డిస్ట్రబెన్స్ ఉండచ్చని మాత్రం అనుకుంటున్నారు. షర్మిల ఎంట్రీతో వైసీపీకి నష్టమని, కాదు కాదు ఓట్లు చీలిపోతే ప్రతిపక్షాలకే నష్టమని ఇలా రకరకాల వాదనలు మొదలయ్యాయి. కాంగ్రెస్ ద్వారా షర్మిల ఎంట్రీ జగన్మోహన్ రెడ్డిని గెలిపించటానికా..? లేకపోతే ఇబ్బందులు పెట్టడానికేనా..? అన్నదే అర్థంకావటం లేదు.

షర్మిల రాకతో పార్టీకి పూర్వవైభవం వస్తుందని హస్తం పార్టీ నేతలు ఆశలు పెట్టుకున్నారు. అయితే పూర్వవైభవం ఎలా వస్తుందో మాత్రం చెప్పలేకపోతున్నారు. సోదరుడితో ప్రత్యక్షంగా గొడవలు పడటం ఇష్టంలేకే షర్మిల తెలంగాణలో సొంతంగా పార్టీ పెట్టుకున్నారనే ప్రచారం అందరికీ తెలిసిందే. ఏపీ బాధ్యతలు తీసుకోమని కాంగ్రెస్ అగ్రనేతలు షర్మిలకు చెప్పినా.. అంగీకరించని విషయాన్ని కొందరు గుర్తుచేస్తున్నారు. అలాంటిది సడన్‌గా షర్మిల కాంగ్రెస్ ద్వారా ఏపీ రాజకీయాల్లో ప్రవేశిస్తారా..? అనే సందేహాలు కూడా ఉన్నాయి.

ఏదేమైనా ప్రతిపక్షాల మధ్య ఓట్లు చీలిపోతే అధికారంలో ఉన్న పార్టీకి లాభమని అందరు అనుకుంటారు. ఒక్కోసారి ఈ సూత్రం తల్లకిందులవుతుంది. మరి ఏపీ కాంగ్రెస్‌లో షర్మిల అడుగుపెడతారా..? ఏ హోదాలో చేరబోతున్నారు, ఎవరిపై ప్రభావం చూపుతుందన్నది ప్రస్తుతానికి సస్పెన్సే. షర్మిల ఎంట్రీ విషయాన్ని రుద్రరాజే ప్రకటించారు కాబట్టి నిజమనే అనుకోవాలేమో.

First Published:  11 Dec 2023 9:34 AM IST
Next Story