రేపు చంద్రబాబుతో పవన్ ములాఖత్
చంద్రబాబుకి బెయులొస్తుందని, లేదా ఆయన్ని హౌస్ రిమాండ్ కి పంపిస్తారనే ఆశ కూడా ఇప్పుడు పూర్తిగా ఆవిరైంది. క్వాష్ పిటిషన్ కూడా వారం రోజులు వాయిదా పడింది. దీంతో పవన్ కల్యాణ్ నేరుగా జైలుకే వెళ్లి చంద్రబాబుని పరామర్శించాలనుకుంటున్నారు.
చంద్రబాబుపై తనకు ఎంత అభిమానం ఉందో ఆయన అరెస్ట్ అయినరోజే చాటి చెప్పారు పవన్ కల్యాణ్. ఆరోజు ఆయన్ను నేరుగా కలిసే అవకాశం పవన్ కి రాలేదు, ఆ తర్వాత బాబు జైలుకి వెళ్లడంతో అవకాశం దొరకలేదు. చంద్రబాబుకి బెయులొస్తుందని, లేదా ఆయన్ని హౌస్ రిమాండ్ కి పంపిస్తారనే ఆశ కూడా ఇప్పుడు పూర్తిగా ఆవిరైంది. క్వాష్ పిటిషన్ కూడా వారం రోజులు వాయిదా పడింది. దీంతో పవన్ కల్యాణ్ నేరుగా జైలుకే వెళ్లి చంద్రబాబుని పరామర్శించాలనుకుంటున్నారు. రేపు ములాఖత్ కోసం రాజమండ్రి సెంట్రల్ జైలుకి వస్తున్నారు. మంగళవారం చంద్రబాబు కుటుంబ సభ్యులు ములాఖత్ కి రాగా, గురువారం పవన్ ఆయన్ను కలవబోతున్నారు.
చంద్రబాబు అరెస్ట్ ని ఖండించిన పవన్ కల్యాణ్, ఆయనకు మద్దతుగా నిలబడతానని ప్రకటించారు. లోకేష్ ని కూడా ఆయన ఫోన్ లో పరామర్శించారు. వైసీపీని గద్దె దించేవరకు పోరాటం చేస్తానన్నారు. ఇప్పుడు జరుగుతున్నవన్నీ, రేపు రిపీట్ అవుతాయని, జగన్ పై కూడా కేసులున్నాయని, ఆయన్ని కూడా జైలుకి పంపిస్తామంటూ ఘాటు హెచ్చరికలు చేశారు. మొత్తమ్మీద జగన్ పై తన అక్కసునంతా వెళ్లగక్కిన పవన్, చంద్రబాబుపై తన ప్రేమను చూపించేందుకు రేపు నేరుగా జైలుకి వెళ్తున్నారు.
జైలులో పొత్తు పొడిచేనా..?
పరామర్శ పేరుతో పవన్ కల్యాణ్ జైలుకి వెళ్తున్నా, పొత్తు రాజకీయాలపై కూడా ఓ క్లారిటీ వస్తుందని అంటున్నారు జనసేన నేతలు. అనధికారికంగా ఇప్పటికే టీడీపీ, జనసేన ఒక్కటయ్యాయి. పొత్తులో ఉన్న బీజేపీ కంటే, పొత్తు పేరు చెప్పకుండానే టీడీపీతో ఎక్కువగా అడ్జస్ట్ అయిపోయారు పవన్. జనసేన నేతలు కూడా విడతలవారీగా లోకేష్ ని కలసి సంఘీభావం తెలుపుతున్నారు. లోకేష్ కూడా తన అన్నయ్య పవన్ కి ధన్యవాదాలు అంటూ జనసైనికుల్ని బాగానే దువ్వుతున్నారు. ఇక ఏపీ రాజకీయాలకు రాజమండ్రి సెంట్రల్ జైలు వేదిక కాబోతోందని అనుకోవాల్సిందే.