ఎంపీ, ఎమ్మెల్యే.. రెండు స్థానాల నుంచి పవన్ పోటీ.!
తెలుగుదేశం, జనసేన పొత్తు ఖరారు అయినప్పటికీ.. ఈ కూటమిలోకి బీజేపీ చేరబోతుందని వార్తలు వస్తున్నాయి. జనసేనకు ఎన్ని సీట్లు కేటాయిస్తారనేదానిపైనే పవన్ రెండు స్థానాల నుంచి పోటీ చేసే అంశం ఆధారపడి ఉందని సమాచారం.
జనసేన అధినేత పవన్‌కల్యాణ్ అసెంబ్లీ సీటుతో పాటు పార్లమెంట్ సీటుపై కన్నేసినట్లు తెలుస్తోంది. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో రెండు స్థానాల నుంచి పోటీ చేసేందుకు ఆయన ఆసక్తి చూపుతున్నారని సమాచారం. ఎన్నికల తర్వాత ఎన్డీఏ కూటమిలో జనసేన కీలక పాత్ర పోషించబోతుందని, అందుకే లోక్‌సభకు పోటీ చేయాలని పవన్ ఆలోచిస్తున్నారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.
అన్ని అనుకున్నట్లుగా జరిగితే పవన్‌కల్యాణ్ కాకినాడ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇక భీమవరం అసెంబ్లీ స్థానం నుంచి పవన్ పోటీ చేసే అవకాశాలున్నాయి. జనసేన మొత్తంగా మూడు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అయితే దీనిపై ఇంకా స్పష్టత రాలేదు. తెలుగుదేశం, జనసేన పొత్తు ఖరారు అయినప్పటికీ.. ఈ కూటమిలోకి బీజేపీ చేరబోతుందని వార్తలు వస్తున్నాయి. జనసేనకు ఎన్ని సీట్లు కేటాయిస్తారనేదానిపైనే పవన్ రెండు స్థానాల నుంచి పోటీ చేసే అంశం ఆధారపడి ఉందని సమాచారం.
2019లో గాజువాక, భీమవరం రెండు అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేశారు పవన్‌కల్యాణ్. రెండు స్థానాల్లోనూ రెండో స్థానంలో నిలిచి ఓడిపోయారు. 2014లో జనసేన పేరుతో పార్టీ ప్రారంభించిన పవన్‌కల్యాణ్ ఇప్పటివరకూ చట్టసభల్లో అడుగుపెట్టలేదు.