Telugu Global
Andhra Pradesh

జనం కోసం ఎదురు చూసిన పవన్

ఏఎస్ గ్రౌండ్స్ లో జ‌న‌సేన బహిరంగసభ జ‌రిగింది. మైదానంలోని సగం స్పేస్‌ను మాత్ర‌మే స‌భ‌కు వాడుకున్నారు. మిగిలిన సగం గ్రౌండును ఎందుకు ఖాళీగా వదిలేసిందో పార్టీ పెద్దలే చెప్పాలి.

జనం కోసం ఎదురు చూసిన పవన్
X

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఊహించని షాక్ తగిలింది. విశాఖపట్నం నగరంలో జరిగిన జ‌న‌సేన బహిరంగ సభ జనాలు లేక వెలవెలపోయింది. పవన్ సభకు జనాలు లేకపోవటం అన్నది బహుశా ఇదే మొదటిసారేమో. పవన్ వస్తున్నారని తెలియటమే ఆలస్యం అభిమానులు పోటెత్తుతారు. జనసేన నేతలు, క్యాడర్ పెద్దగా లేకపోయినా అభిమానులైతే కావాల్సినంత మంది ఉన్నారు. పవన్ ఎక్కడ మీటింగులు పెట్టినా, ర్యాలీలు, రోడ్డు షోలు చేసినా కనబడేది అభిమానుల కోలాహలమే.

ఒకవిధంగా చెప్పాలంటే పవన్ అభిమానులు అసంఘటిత కార్మికుల్లాంటి వాళ్ళు. దారి తెన్ను లేకుండా ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తుంటారు. వీళ్ళ పైత్యం ఏ రేంజులో ఉంటుందంటే బహిరంగసభలో పవన్ను కూడా ప్రశాంతంగా మాట్లాడనీయరు. మాటమాటకు నానా రచ్చ చేస్తుంటారు. పవన్ కు ఇంతటి పిచ్చి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కాబట్టే బహిరంగసభలకు జనాలు రాలేదన్న లోటుండదు. అందుకనే నేతల జనసమీకరణ కన్నా అభిమానుల గోలే ఎక్కువగా ఉంటుంది. అలాంటిది గురువారం నిర్వహించిన బహిరంగ సభకు జనాలు రాలేదంటేనే ఆశ్చర్యంగా ఉంది.

ఏఎస్ గ్రౌండ్స్ లో జ‌న‌సేన బహిరంగసభ జ‌రిగింది. మైదానంలోని సగం స్పేస్‌ను మాత్ర‌మే స‌భ‌కు వాడుకున్నారు. మిగిలిన సగం గ్రౌండును ఎందుకు ఖాళీగా వదిలేసిందో పార్టీ పెద్దలే చెప్పాలి. అలాంటి సగం గ్రౌండులో వేసిన కుర్చీల్లో కూడా సగంకన్నా ఎక్కువ కుర్చీలు ఖాళీగా కనిపించాయి. జన సమీకరణలో ఫెయిలయ్యారని పవన్ లోకల్ నేతలపై బాగా మండిపోయారని సమాచారం. సాయంత్రం 5 గంటలకే బహిరంగసభ మొదలవాల్సున్నా జనం లేరని చెప్పి ఓ రెండుగంటలు పవన్ హోటల్లోనే ఉండిపోయారట. అయినా వేసిన కుర్చీలన్నీ నిండలేదు. జన సమీకరణ చేయలేక నేతలు కూడా చేతులెత్తేశారని సమాచారం.

బహుశా ఇలాంటి అనుభవం పవన్ కు మొదటిసారి ఎదురయ్యుంటుంది. దీనికి కారణం పవన్ వైఖరే అయ్యుంటుంది. తన మాటకు ఎదురుచెప్పకూడదు, టీడీపీతో పొత్తును ఎవరు ప్రశ్నించకూడదు, ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళంతా వైసీపీ కోవర్టులే అని ఈమధ్యనే పవన్ అన్న మాటలు అందరికీ గుర్తుండే ఉంటుంది. తన నిర్ణయాలు ఇష్టంలేని వాళ్ళు వెంటనే జనసేనకు రాజీనామా చేసి వైసీపీలో చేరమని పవన్ బహిరంగంగానే వార్నింగిచ్చారు. పవన్ ఏకపక్ష ధోరణితోనే ఉత్తరాంధ్ర నేతలు విభేదించి తమవంతుగా జనసమీకరణపై చేతులెత్తేశారా అనే టాక్ పెరిగిపోతోంది. మరి జనాలు ఎందుకు రాలేదో పార్టీనే చెప్పాలి.

First Published:  8 Dec 2023 10:38 AM IST
Next Story