Telugu Global
Andhra Pradesh

పవన్ మౌనదీక్ష.. ఎందుకంటే..?

జగన్‌ మాదిరిగా కేసులు పెట్టి, జైళ్లకు పంపే ఆలోచన సరికాదని చెప్పారు పవన్. జగన్‌పై తనకు వ్యక్తిగత ద్వేషం లేదని, జగన్‌ ఆలోచన, పాలన నిర్ణయాలను మాత్రమే తాను వ్యతిరేకిస్తున్నానని అన్నారు.

పవన్ మౌనదీక్ష.. ఎందుకంటే..?
X

చంద్రబాబు కోసం కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు దీక్షలు చేపట్టిన రోజే.. పవన్ కల్యాణ్ కూడ మౌనదీక్ష చేపట్టడం విశేషం. ఈ దీక్ష చంద్రబాబుకోసం అని ఆయన నేరుగా చెప్పకపోయినా.. ఆమాత్రం జనం, జనసైనికులు అర్థం చేసుకోగలరు. వారాహి యాత్రకు టీడీపీ సంఘీభావం తెలపడం, చంద్రబాబు కోసం పవన్ దీక్షకు కూర్చోవడం చూస్తుంటే.. రెండు పార్టీల మధ్య ప్యాచప్ బాగానే జరుగుతున్నట్టు తెలుస్తోంది.


దీక్ష ఎందుకంటే..?

అవినీతి, దౌర్జన్యంతో ప్రజల కష్టాన్ని, శ్రమను వైసీపీ నేతలు దోచుకుంటున్నారని అన్నారు పవన్. రాష్ట్రంలో జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా రెండు గంటలు మౌన దీక్ష చేపట్టానన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న దోపిడీ, అవినీతికి అడ్డుకట్ట వేయాలని చెప్పారు. రాజకీయాల్లో అభిప్రాయ భేదాలు ఉండటం సహజం అని, జగన్‌ మాదిరిగా కేసులు పెట్టి, జైళ్లకు పంపే ఆలోచన సరికాదని చెప్పారు పవన్. జగన్‌పై తనకు వ్యక్తిగత ద్వేషం లేదని, జగన్‌ ఆలోచన, పాలన నిర్ణయాలను మాత్రమే తాను వ్యతిరేకిస్తున్నానని అన్నారు. గ్రామ స్వరాజ్యాన్ని వైసీపీ ప్రభుత్వం చంపేసిందని చెప్పారు. రాజకీయాల్లో బురద పడుతుందని తెలుసని, అయినా ముందుకే కొనసాగుతామన్నారు పవన్.

ప్రస్తుతం పవన్ కల్యాణ్ వారాహి యాత్రకోసం జనంలోకి వచ్చారు. అవనిగడ్డ సభ తర్వాత ఆయన మచిలీపట్నంలో వారాహి యాత్ర చేపట్టాల్సి ఉంది. గాంధీ జయంతి సందర్భంగా.. మచిలీపట్నం పరాసుపేట, సువర్ణ కల్యాణ మండపంలో.. మహాత్ముడి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు పవన్. సాయంత్రం 5 గంటలకు కృష్ణా జిల్లా నాయకులు, కార్యకర్తలతో సమావేశం జరుగుతుంది. 3వతేదీ జనవాణిలో పాల్గొంటారు. 4వతేదీ పెడన, 5న కైకలూరు నియోజకవర్గాల్లో పవన్ పర్యటిస్తారు.

First Published:  2 Oct 2023 1:10 PM IST
Next Story