ముద్రగడను అనవసరంగా కెలికారా?
కాపు సామాజికవర్గంలోని వాట్సాప్ గ్రూపుల్లో ముద్రగడకు మద్దతు పెరుగుతోంది. ఇదంతా చూస్తుంటే అనవసరంగా ముద్రగడను పవన్ కెలికారనే అభిప్రాయాలు పెరిగిపోతున్నాయి.
వారాహియాత్ర కేంద్రంగా తూర్పుగోదావరి జిల్లాలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభాన్ని అనవసరంగా కెలికారా అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. అలాగే ముద్రడగతో అనవసరంగా పెట్టుకున్నారనే అభిప్రాయాలు కూడా కాపు నేతల్లో వినబడుతున్నాయి. ఇంతవరకు పవన్-ముద్రగడ ఏ విషయంలో కూడా ఎదురైంది లేదు, ఒకరి విషయంలో మరొకరు జోక్యం చేసుకున్నది పెద్దగా లేదనే చెప్పాలి.
అలాంటిది వారాహియాత్రలో పవన్ పరోక్షంగానే అయినా ముద్రగడను కెలికారు. ముద్రగడ అంటే చంద్రబాబునాయుడుకు బాగా కోపముందని తెలుసు. పోయిన ఎన్నికల్లో ఉద్యమాల పేరుతో కాపులను టీడీపీకి దూరచేశారనే మంట ఉంది. రిజర్వేషన్లు కల్పిస్తానని కాపులను చంద్రబాబు మోసం చేయటం వల్లే ముద్రగడ ఉద్యమం చేశారు. అయితే తనలోని తప్పును చంద్రబాబు ఎప్పుడూ ఒప్పుకోరు. అందుకనే ఉద్యమ నేతపై ద్వేషం పెంచుకున్నారు.
ముద్రగడపై తనలో పేరుకుపోయిన మంటను డైరెక్ట్‌గా కాకుండా ఇన్ డైరెక్ట్‌గా పవన్‌తో కెలికించటం ద్వారా కాపులను తన వైపుకు లాక్కోవాలని చంద్రబాబు ప్లాన్ చేసినట్లన్నారు. అందుకనే ముద్రగడపై పవన్ ఆరోపణలు చేసింది. అయితే ముద్రగడ రెచ్చిపోవటంతో సీన్ మొత్తం రివర్స్ అవుతోంది. పవన్ వెనక్కుతగ్గినా ముద్రగడ తగ్గేట్లుగా కనబడటంలేదు. ముద్రగడ రెచ్చిపోయేకొద్దీ జనసేనకే కాదు టీడీపీకి కూడా నష్టమనే అనుకోవాలి. అసలే పవన్‌పైన కాపుల్లో చాలామందికి మంచి అభిప్రాయంలేదు. ఇదే సమయంలో ముద్రగడకు మిస్టర్ క్లీన్ అనే పేరుంది.
కాపు ఉద్యమం సమయంలో ముద్రగడ ఫ్యామిలీని బహిరంగంగా దారుణంగా అవమానించిన చంద్రబాబు అన్నా, అసలా ఇష్యూనే పట్టించుకోని పవన్ అన్నా కాపుల్లో చాలా మందికి బాగా కోపం ఉంది. అలాంటిది ఇప్పుడు తగుదునమ్మా అంటూ ఏకంగా ముద్రగడపైనే పవన్ నోరుపారేసుకుంటే ఎవరు ఒప్పుకుంటారు? అందుకనే ముద్రగడకు మద్దతుగా కాపుల్లో చర్చలు మొదలయ్యాయి. కాపు సామాజికవర్గంలోని వాట్సాప్ గ్రూపుల్లో ముద్రగడకు మద్దతు పెరుగుతోంది. ఇదంతా చూస్తుంటే అనవసరంగా ముద్రగడను పవన్ కెలికారనే అభిప్రాయాలు పెరిగిపోతున్నాయి. ముద్రగడ-పవన్‌ల మధ్య ఫైట్ పెరిగితే ఎన్నికల నాటికి పవన్‌కే కాదు జనసేనతో పొత్తు పెట్టుకున్న పార్టీలకు కూడా నష్టం తప్పదనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.