టీడీపీతో పొత్తు భేటీని వాయిదా వేసుకున్న పవన్.. సడన్ ట్విస్ట్
ఈరోజు మంగళగిరిలో జనసేన విస్తృత స్ధాయి భేటీ జరగనుందని.. ఆ వెంటనే టీడీపీ, జనసేన యాక్షన్ కమిటీపై తుది నిర్ణయం తీసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ.. సడన్‌గా పవన్ కళ్యాణ్ తన పర్యటనని వాయిదా వేసుకున్నారు.
టీడీపీతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధికారికంగా పొత్తు ప్రకటించి నెల రోజులు గడుస్తున్నా.. ఇప్పటి వరకూ ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబుని ములాఖత్‌లో కలిసిన పవన్ కళ్యాణ్.. బయటికి వచ్చిన వెంటనే పొత్తుపై ప్రకటన చేశారు. త్వరలోనే రెండు పార్టీలు సమావేశమై జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేసి.. పొత్తు, సీట్ల పంపకంపై క్లారిటీ ఇస్తామని కూడా చెప్పుకొచ్చారు. కానీ ఆ తర్వాత సైలెంట్ అయిపోయారు.
యాక్షన్ అన్నారు.. కానీ సడన్‌గా కట్
ఈరోజు మంగళగిరిలో జనసేన విస్తృత స్ధాయి భేటీ జరగనుందని.. ఆ వెంటనే టీడీపీ, జనసేన యాక్షన్ కమిటీపై తుది నిర్ణయం తీసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ.. సడన్‌గా పవన్ కళ్యాణ్ తన పర్యటనని వాయిదా వేసుకున్నారు. కృష్ణా జిల్లాలో వారాహి యాత్రని ఇటీవల ముగించుకున్న పవన్ కళ్యాణ్.. ఆ తర్వాత సినిమా షూటింగ్స్‌లో బిజీ అయిపోయారు. ఈ క్రమంలో అతనికి వైరల్ ఫీవర్ సోకడంతో భేటీని వాయిదా వేసుకున్నట్లు జనసేన సమాచారం అందించింది. దాంతో టీడీపీ నేతలు నిరాశ వ్యక్తం చేశారు.
పవన్ నాన్చుడి ధోరణితో.. టీడీపీలో అసహనం
పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి ఇప్పుడు టీడీపీకి కొత్త తలనొప్పి తెచ్చిపెడుతోంది. ఇటీవల పెడనలో జరిగిన వారాహి యాత్రలో టీడీపీ బలహీనంగా ఉంది కాబట్టే తాను పొత్తు పెట్టుకుంటున్నట్లు ప్రకటించారు. దాంతో అధికార వైసీపీకి అస్త్రం దొరికినట్లయ్యింది. ఇప్పుడేమో జాయింట్ యాక్షన్ కమిటీ కార్యరూపం దాల్చనీయడం లేదు. ఎన్నికలు సమీపిస్తున్న ఈ తరుణంలో పవన్ జాప్యంతో టీడీపీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీలోనే తెలంగాణలో టీడీపీ- జనసేన పొత్తుపై కూడా ఓ క్లారిటీ ఇవ్వాలని టీడీపీ నేతలు ఆశించారు. కానీ.. పవన్ అనారోగ్యం వారి ఆశలపై నీళ్లు చల్లింది.
నెక్ట్స్ వీక్ విదేశాలకు పవన్.. 10 రోజులు బ్రేక్
పవన్ కళ్యాణ్ ఈ నెల 17 విదేశాలకు వెళ్లబోతున్నారు. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి వివాహాన్ని ఇటలీలో మెగా ఫ్యామిలీ ప్లాన్ చేయగా.. పవన్ అక్కడికే వెళ్లబోతున్నారు. అక్కడ ఫ్యామిలీతో ఎంజాయ్ చేసి మళ్లీ తిరిగి హైదరాబాద్‌కి ఈ నెల 26న తిరిగొచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా పవన్ కళ్యాణ్‌తో భేటీ అయ్యి.. పొత్తు, సీట్ల పంపకంపై క్లారిటీ తీసుకోవడంతో పాటు తెలంగాణలో పొత్తుపై కూడా తేల్చేయాలని టీడీపీ ఆశించింది. కానీ.. పవన్ తీరుతో వారికి నిరీక్షణ తప్పడం లేదు.