Telugu Global
Andhra Pradesh

బాబుతో మళ్లీ పవన్ ములాఖత్..? యాక్షన్ కమిటీ భేటీ తేదీ ఖరారు

టీడీపీ, జనసేన పార్టీలు పొత్తుపై ముందుకు వెళ్లేందుకు ఇప్పటికే సమన్వయ కమిటీలను ప్రకటించాయి. అయితే.. రెండు పార్టీల కమిటీలు సోమవారం జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి తదుపరి కార్యాచరణపై చర్చించబోతున్నాయి.

బాబుతో మళ్లీ పవన్ ములాఖత్..? యాక్షన్ కమిటీ భేటీ తేదీ ఖరారు
X

రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబుని మరోసారి పవన్ కళ్యాణ్ కలిసే సూచనలు కనిపిస్తున్నాయి. చంద్ర‌బాబు అరెస్ట్ తర్వాత రోజుల వ్యవధిలోనే నందమూరి బాలకృష్ణ, నారా లోకేష్‌తో కలిసి ములాఖత్‌లో కలిసిన పవన్ కళ్యాణ్.. ఆ జైలు నుంచి బయటికి వచ్చిన వెంటనే టీడీపీ- జనసేన పొత్తుని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ పొత్తులకు సంబంధించి కీలక భేటీ రాజమండ్రి వేదికగా జరగనుంది. ఈ భేటీకి ముందు లోకేష్‌తో కలిసి చంద్ర‌బాబును పవన్ కళ్యాణ్ కలిసే సూచనలు కనిపిస్తున్నాయి.

యాక్షన్ కమిటీ ఫస్ట్ మీటింగ్‌ తేదీ ఖరారు

టీడీపీ, జనసేన పార్టీలు పొత్తుపై ముందుకు వెళ్లేందుకు ఇప్పటికే సమన్వయ కమిటీలను ప్రకటించాయి. అయితే.. రెండు పార్టీల కమిటీలు సోమవారం జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి తదుపరి కార్యాచరణపై చర్చించబోతున్నాయి. జనసేన కమిటీకి నాదెండ్ల మనోహర్ నాయకత్వం వహించబోతున్నట్లు తొలుత వార్తలు వచ్చినా.. పవన్ కళ్యాణ్ నేరుగా రంగంలోకి దిగబోతున్నారు. మరోవైపు టీడీపీకి నారా లోకేష్ నాయకత్వం వహించబోతున్నారు. ఈ భేటీకి ముందు లేదా తర్వాత చంద్ర‌బాబుని కలవడం మాత్రం పక్కా అని తెలుస్తోంది.

నెక్ట్స్ వీక్ మొత్తం టీడీపీకి జనసేన సపోర్ట్

చంద్రబాబు రిమాండ్‌ని నవంబరు 1 వరకు ఏసీబీ కోర్టు పొడిగించడంతో టీడీపీ వచ్చే వారం మొత్తం ప్రజల్లోనే ఉండాలని ప్లాన్ చేసింది. `నిజం గెలవాలి` అంటూ భువనేశ్వరి, `భవిష్యత్ గ్యారెంటీ` ప్రోగ్రామ్‌తో నారా లోకేష్ రాష్ట్రంలో ప‌ర్య‌టించ‌నున్నారు. దాంతో ఈ రెండు కార్యక్రమాలకీ జనసేన నేతలు మద్దతు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చే అవకాశం ఉంది. నవంబరు మొదటి వారంలో వారాహి యాత్రకి పవన్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అప్పుడు టీడీపీ మద్దతు కోరే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారాల్ని జాయింట్ యాక్షన్ కమిటీ పర్యవేక్షించనుంది.

తెలంగాణలో పొత్తుపై కొనసాగుతున్న ఉత్కంఠ

ఏపీలో టీడీపీ - జనసేన పొత్తుపై క్లారిటీగా ఉన్నా.. తెలంగాణ విషయంలో మాత్రం రెండు పార్టీలూ ఓ స్పష్టతకు రాలేకపోతున్నాయి. ఎన్నికల్లో పోటీచేస్తామని రెండు పార్టీలు ప్రకటించాయి. కానీ.. ఎన్ని సీట్లు అనే విషయం మాత్రం చెప్పడం లేదు. మరోవైపు బీజేపీ కూడా రెండు పార్టీలకీ గాలం వేస్తోంది. దాంతో సాధ్యమైనంత తొందరగా ఈ వ్యవహారాన్ని తేల్చాలని పవన్, లోకేష్ భావిస్తున్నారు. ఓవరాల్‌గా రాజమండ్రి భేటీ తర్వాత చాలా ప్రశ్నలకు సమాధానం దొరికే అవకాశం ఉంది.

First Published:  20 Oct 2023 10:30 PM IST
Next Story