పవన్ కళ్యాణ్ ఆశలు గల్లంతు..
వామపక్షాలతో పొత్తు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి కలిసి వచ్చింది. అయితే, వామపక్షాల మద్దతును చంద్రబాబు జారవిడుచుకుంటున్నారు.
వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పెట్టుకున్న ఆశలు గల్లంతయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే ఉద్దేశంతో తాను టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నట్లు, తమ కూటమిలోకి బీజేపీని కూడా ఆహ్వానిస్తున్నట్లు ఆయన చెప్పుతూ వస్తున్నారు. టీడీపీ, జనసేన కూటమితో బీజేపీ జత కట్టే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో వామపక్షాలు కాంగ్రెస్‌తో కలిసి నడవాలనే ఆలోచన చేస్తున్నాయి.
ఈనెల 20వ తేదీన తమతో కలిసి వచ్చే పార్టీలతో కాంగ్రెస్ సమావేశం ఏర్పాటు చేసింది. నిజానికి, సీపీఐ టీడీపీతో కలిసి వెళ్లాలని తొలుత భావించింది. అయితే. టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్న నేపథ్యంలో కాంగ్రెస్‌తో కలిసి వెళ్లాలని నిర్ణయం తీసుకుంది. సీపీఐ, కాంగ్రెస్ మధ్య చర్చలు ఇప్పటికే తుది దశకు చేరుకున్నాయి. సీపీఎం వైఖరి కూడా రెండు రోజుల్లో స్పష్టం కానుంది.
వామపక్షాలతో పొత్తు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి కలిసి వచ్చింది. అయితే, వామపక్షాల మద్దతును చంద్రబాబు జారవిడుచుకుంటున్నారు. వామపక్షాలు కలిసి వస్తే ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల ఓట్లు తమకు పడుతాయని కాంగ్రెస్ భావిస్తోంది. అయితే, ఎంత చేసినా రాష్ట్రంలో కాంగ్రెస్ విజయం సాధించే అవకాశాలు లేవు.
వామపక్షాలు కాంగ్రెస్‌తో కలిస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి నష్టం జరిగే అవకాశాలే మెండుగా ఉంటాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రయత్నానికి విఘాతం కలుగుతుంది.