చంద్రబాబుకు పవన్ సవాల్... మరో నాలుగు స్థానాల్లో అభ్యర్థుల ప్రకటన
చంద్రబాబు రెండు సీట్లు ప్రకటించడంతో మండిపోయిన పవన్.. తామూ రాజానగరం, రాజోలు నియోజవర్గాల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. రాజమండ్రి రూరల్ కూడా తమకే కావాలని జనసేన పట్టుబడుతోంది.
వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేసే స్థానాలను ప్రకటించడంలో టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడితో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పోటీ పడుతున్నారు. జనసేన, టీడీపీ మధ్య సీట్ల సర్దుబాటు కొలిక్కి రాలేదు. ఎవరెన్ని సీట్లకు పోటీ చేస్తారనే విషయంపై కూడా స్పష్టత రాలేదు. కానీ, చంద్రబాబు ఏకపక్షంగా విడతలవారీగా తాము పోటీ చేసే స్థానాలను, పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించుకుంటూ వెళ్తున్నారు. చంద్రబాబుకు పోటీగా పవన్ కల్యాణ్ తమ పార్టీ పోటీ చేసే స్జానాలను ప్రకటించుకుంటూ వెళ్తున్నారు. తద్వారా చంద్రబాబుకు ఆయన సవాల్ విసురుతున్నారు. దీనివల్ల ఆయా నియోజకవర్గాల్లో ఇరు పార్టీల నాయకుల మధ్య విభేదాలు చోటు చేసుకుంటున్నాయి.
చంద్రబాబు రెండు సీట్లు ప్రకటించడంతో మండిపోయిన పవన్.. తామూ రాజానగరం, రాజోలు నియోజవర్గాల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. రాజమండ్రి రూరల్ కూడా తమకే కావాలని జనసేన పట్టుబడుతోంది. ఆ సీటును తమ పార్టీ నాయకుడు కందుల దుర్గేష్‌కు ఇవ్వాలని జనసేన నేతలు డిమాండ్ చేస్తున్నారు. అక్కడ ఆరు సార్లు విజయం సాధించిన టీడీపీ నాయకుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఉన్నారు. తనను కాదని దుర్గేష్‌కు ఎలా ఇస్తారని ఆయన గుర్రుమంటున్నారు.
విశాఖపట్నంలో అన్నయ్య నాగబాబుతో కలిసి సమీక్షలు నిర్వహించిన పవన్ కల్యాణ్ తాజాగా నాలుగు స్థానాలకు తాము పోటీ చేస్తున్నామంటూ ఆ స్థానాల్లో పోటీ చేసే తన పార్టీ అభ్యర్థులను కూడా ప్రకటించారు. భీమిలికి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్‌ను, పెందుర్తికి పంచకర్ల రమేష్ బాబును, గాజువాకకు సుందరపు సతీష్ కుమార్‌ను, యలమంచిలికి సుందరపు విజయ్ కుమార్‌ను ఇన్‌చార్జ్‌లుగా ప్రకటించారు. పెందుర్తి జోలికి ఇతరులు ఎవరు వచ్చినా సహించేది లేదని టీడీపీ సీనియర్ నాయకుడు బండారు సత్యనారాయణ మూర్తి ఇప్పటికే హెచ్చరించారు.
చంద్రబాబు ఓ వైపు, పవన్ కల్యాణ్ మరో వైపు ఏకపక్షంగా స్థానాలను ప్రకటించుకుంటూ వెళ్లడం ఎంత వరకు వెళ్తుందనేది తెలియడం లేదు. టీడీపీ, జనసేన మధ్య పొత్తు ఉన్నా సీట్ల పంపకం పూర్తి కాలేదు. బీజేపీతో పొత్తు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఈ స్థితిలో ఇరు పార్టీల మధ్య నియోజకవర్గాలవారీగా ఇరు పార్టీల మధ్య తగాదాలు, వివాదాలు రాజుకుంటున్నాయి.