Telugu Global
Andhra Pradesh

జనసేన మీద కుట్రలా?

ఇప్పుడు విషయం ఏమిటంటే పార్టీలోని నేతలు, కార్యకర్తలకు పవన్ ఓపెన్ లెటర్ రాశారు. అందులో ఏమన్నారంటే జనసేనను దెబ్బతీసేందుకు కుట్రలు చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసిందట.

జనసేన మీద కుట్రలా?
X

జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైఖరి చాలా విచిత్రంగా ఉంటుంది. ఎప్పుడూ ఏదో భ్రమల్లో ఉండిపోతుంటారు. తనని తాను చాలా ఎక్కువగా ఊహించుకోవటం, జగన్మోహన్ రెడ్డి కన్నా తానే ఎక్కువని ఫీలైపోతుంటారు. ఇక్కడే పవన్‌తో సమస్యలు వస్తున్నాయి. ఇప్పుడు విషయం ఏమిటంటే పార్టీలోని నేతలు, కార్యకర్తలకు పవన్ ఓపెన్ లెటర్ రాశారు. అందులో ఏమన్నారంటే జనసేనను దెబ్బతీసేందుకు కుట్రలు చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసిందట.

ఇక్కడ రెండు విషయాలున్నాయి. మొదటిదేమో జనసేనను దెబ్బతీయటానికి ప్రత్యేకంగా ఇంకెవరో కుట్రలు చేయాల్సిన అవసరం లేదు. ఆ పనిని పవనే దిగ్విజయంగా చేస్తున్నారు. పార్టీ పెట్టి పదేళ్ళయినా ఇంతవరకు ఎదుగుబొదుగు లేదంటేనే అర్థ‌మైపోతోంది జనసేన పరిస్థితేంటో. రాజకీయాల్లో తాను నిలదొక్కుకోవాలని, అధికారంలోకి రావాలని కాకుండా ఇంకోరి రాజకీయ ప్రయోజనాలను కాపాడటానికి పవన్ డిసైడ్ అయిన‌ప్పుడే అందరికీ అర్థ‌మైపోయింది జనసేన భవిష్యత్తు.

ఇంతోటిదానికి జనసేనను దెబ్బతీసేందుకు ఇంకెవరో కుట్రలు చేయాల్సిన అవసరమే లేదు. ఇక రెండో విషయం ఏమిటంటే వైసీపీని దెబ్బకొడతానని బహిరంగంగా పవన్ చాలెంజ్‌లు చేస్తున్నారు కదా. మరి అదే పద్ధ‌తిలో జనసేనను దెబ్బకొట్టడానికి జగన్ ప్రయత్నాలు చేయటంలో తప్పేమిటి? రాజకీయాల్లో ప్రత్యర్థులున్నాక ఒకరినొక‌రు దెబ్బకొట్టడానికే ప్రయత్నిస్తారని అందరికీ తెలిసిందే కదా. రాష్ట్రంలో ఎక్కడ ఏ ఘటన జరిగినా వెంటనే పవన్ రెచ్చిపోయేది జగన్‌కు వ్యతిరేకంగానే కదా. అది పనిగట్టుకుని వైసీపీ ఇమేజ్‌ని దెబ్బ తీసినట్లు కాదా?

రోజురోజుకు పవన్ కల్యాణ్ వైఖరి మరీ విచిత్రంగా మారిపోతోంది. తాను ఎవరిని ఏమన్నా అనొచ్చు, కానీ తనను మాత్రం ఎవరూ ఏమనకూడదనే పోకడ పెరిగిపోతోంది. నేత‌ల‌కు నీతులు చెప్పటం కాదు ముందు తాను ఆచరించాలి. నేతలకు చెప్పిన బుద్ధులో కీలకమైనది ఏమిటంటే కేవలం మీడియాలో వచ్చిందనో లేకపోతే ఇంకెవరో మాట్లాడారనో నిర్ధారణ కాని అంశాలపై మాట్లాడొద్ద‌ని స్ట్రిక్ట్‌గా చెప్పారు. అయితే పొద్దున లేస్తే పవన్ చేసేపనే అది. జగన్‌కు వ్యతిరేకంగా ఎల్లో మీడియాలో కథనాలు రాగానే ప్రభుత్వంపై రెచ్చిపోతుంటారు. కాబట్టి నీతులు చెప్పటం కాదు ముందు తాను ఆచరించాలని పవన్ అనుకుంటే బాగుంటుంది.

First Published:  25 April 2023 10:58 AM IST
Next Story