మంచి ముహూర్తం కోసం వెయిటింగ్.. ఆరోజే పవన్ బాధ్యతల స్వీకరణ
జనసేన విడుదల చేసిన ప్రకటన ప్రకారం ఈనెల 19న పవన్ కల్యాణ్ మంత్రిగా తన శాఖల బాధ్యతలు స్వీకరిస్తారు.
డిప్యూటీ సీఎం పదవితోపాటు మంత్రిగా పవన్ కల్యాణ్ కి కీలకమైన నాలుగు శాఖలు దక్కాయి. ఆయనతోపాటు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన నేతలంతా లాంఛనంగా బాధ్యతలు స్వీకరించి పనులు మొదలు పెట్టారు. జనసేన మంత్రి నాదెండ్ల మనోహర్ సమీక్షలు, తనిఖీలు అంటూ హడావిడి చేస్తున్నారు. కానీ పవన్ కల్యాణ్ మాత్రం ఆ విషయంలో ఆలస్యం చేస్తున్నారు. మంత్రిగా ఆయన ఇంకా బాధ్యతలు స్వీకరించలేదు. మంచి ముహూర్తం కోసం వేచి చూస్తున్నారు.
జనసేన విడుదల చేసిన ప్రకటన ప్రకారం ఈనెల 19న పవన్ కల్యాణ్ మంత్రిగా తన శాఖల బాధ్యతలు స్వీకరిస్తారు.కీలకమైన పంచాయతీ రాజ్ శాఖ, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ, అటవీ – పర్యావరణ శాఖ, సైన్స్ & టెక్నాలజీ శాఖలు పవన్ వద్ద ఉన్నాయి. ఆశాఖల బాధ్యత తనకు అప్పజెప్పినందుకు సీఎం చంద్రబాబుకి కృతజ్ఞతలు తెలిపారాయన. అయితే బాధ్యతల స్వీకరణకు మాత్రం ఆయన మంచి ముహూర్తం చూసుకుంటున్నారు. అధికారికంగా బాధ్యతలు చేపట్టి ఆ తర్వాత వరుసబెట్టి సమీక్షలు నిర్వహిస్తారని తెలుస్తోంది.
19వ తేదీన బాధ్యతలు స్వీకరించనున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు @PawanKalyan
— JanaSena Party (@JanaSenaParty) June 16, 2024
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ నెల 19వ తేదీ, బుధవారం నాడు పదవి బాధ్యతలను స్వీకరించనున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల బాధ్యతలను శ్రీ…
పవన్ బిజీ బిజీ..
మంత్రిగా బాధ్యతలు చేపట్టకపోయినా పవన్ కల్యాణ్ విజయవాడ - హైదరాబాద్ మధ్య బిజీ బిజీగా తిరుగుతున్నారు. ఇటీవలే తన అన్నయ్య చిరంజీవి ఇంటికి వెళ్లారు. పవన్ వదిన కాస్ట్ లీ పెన్ బహూకరించారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎన్నికల్లో గెలిచిన తర్వాత కొన్నిరోజులు పూర్తిగా కుటుంబానికి సమయం కేటాయించిన పవన్.. ఈనెల 19న మంత్రిగా బాధ్యతలు స్వీకరించి పూర్తిగా పాలనలో బిజీ కాబోతున్నారు.