17న కర్ణాటకకు పవన్.. బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం
ఈనెల 17న కర్ణాటక రాష్ట్రం రాయచూర్ లో పవన్ కళ్యాణ్ ప్రచారం చేపట్టనున్నారు. ఉదయం 11 గంటలకు రాయచూర్ బెంజ్ సర్కిల్ నుంచి పవన్ రోడ్ షో ప్రారంభం కానుంది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కర్ణాటక రాష్ట్రంలో పర్యటించనున్నారు. తెలుగు ప్రజలు అధికంగా ఉండే ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించనున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కోనసీమ జిల్లాల్లో వారాహి యాత్ర నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి ఆయన సభల్లో పాల్గొంటున్నారు. జనసేన ఎన్డీయే కూటమిలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కూటమి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేసేందుకు పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు తాత్కాలికంగా బ్రేక్ ఇవ్వనున్నారు.
ఈనెల 17న కర్ణాటక రాష్ట్రం రాయచూర్ లో పవన్ కళ్యాణ్ ప్రచారం చేపట్టనున్నారు. ఉదయం 11 గంటలకు రాయచూర్ బెంజ్ సర్కిల్ నుంచి పవన్ రోడ్ షో ప్రారంభం కానుంది. అదేరోజు మధ్యాహ్నం బళ్లారిలో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేపట్టనున్నారు. చిక్కబళ్లాపుర, కోలార్ తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం నిర్వహించనున్నారు.
కర్ణాటకలో ఏపీకి సరిహద్దున ఉండే జిల్లాల్లో పవన్ కళ్యాణ్ తో ప్రచారం చేయిస్తే ప్రభావం ఉంటుందని భావిస్తున్న బీజేపీ నాయకులు పవన్ కళ్యాణ్ ను ఎన్నికల ప్రచారానికి ఆహ్వానించారు. దీనికి పవన్ కళ్యాణ్ కూడా సమ్మతి తెలపడంతో పర్యటన ఖరారైంది.
జనసేనతో పాటు టీడీపీ కూడా ఎన్డీయే కూటమిలో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కూటమి తరపున తమిళనాడులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. తెలుగు వాళ్ళు అధికంగా నివసించే కోయంబత్తూరులో నిన్న లోకేష్ ప్రచారం చేపట్టారు. బీజేపీ కోసం తమిళనాడులో లోకేష్ ప్రచారం చేస్తుండగా.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా కర్ణాటకలో బీజేపీ తరపున ప్రచారం చేసేందుకు వెళ్తున్నారు.