Telugu Global
Andhra Pradesh

తలకాయలు తీసేస్తాం జాగ్రత్త.. అధికారులకు పవన్ హెచ్చరిక

రాజ్యాంగంలో ఉన్నదేంటి, మీరు చేస్తున్నదేంటి అంటూ అధికారులపై విరుచుకుపడ్డారు పవన్. మా నేలమీదకొస్తామంటే మమ్మల్ని ఆపుతారా..? మీరేమైనా పైనుంచి దిగొచ్చారా..? తలకాయలు ఎగరేయొద్దు, తలకాయలు తీసేస్తాం జాగ్రత్త.. అంటూ హెచ్చరించారు.

తలకాయలు తీసేస్తాం జాగ్రత్త.. అధికారులకు పవన్ హెచ్చరిక
X

కుల రాజకీయాలకు ఏపీలో అధికారులు వత్తాసు పలుకుతున్నారని మండిపడ్డారు పవన్ కల్యాణ్. జనసేన విస్తృత స్థాయి సమావేశం తర్వాత ఆయన, అధికారులపై విమర్శలతో విరుచుకుపడ్డారు. ఐఏఎస్, ఐపీఎస్ చదువుకున్న అధికారులు తమ నాయకులపై తప్పుడు కేసులు పెడుతున్నారని అన్నారు. కేసులు పెడితే భయపడిపోతామా అని ప్రశ్నించారు. అధికారులకు సిగ్గుండాలి, అధికారులు సిగ్గుపడాలి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు పవన్. అధికారులు ప్రజలకు రక్షణగా ఉండాలని, ప్రజల ఆస్తులకు కాపలాగా ఉండాలి కానీ.. అధికారంలో ఉన్నవారికి వత్తాసు పలకడమేంటన్నారు. ప్రజలకు కోపం వస్తే చేతులతో కొట్టి చంపేస్తారని హెచ్చరించారు పవన్.

తలకాయలు తీసేస్తాం జాగ్రత్త..

రాజ్యాంగంలో ఉన్నదేంటి, మీరు చేస్తున్నదేంటి అంటూ అధికారులపై విరుచుకుపడ్డారు పవన్. మా నేలమీదకొస్తామంటే మమ్మల్ని ఆపుతారా..? మీరేమైనా పైనుంచి దిగొచ్చారా..? తలకాయలు ఎగరేయొద్దు, తలకాయలు తీసేస్తాం జాగ్రత్త.. అంటూ హెచ్చరించారు. దక్షయజ్ఞంలో వీరభద్రుడు ఎలా తలల్ని విసిరేసి కొట్టాడో అలా కొట్టేస్తామని, వినమ్రతతో ఉండే తలలు వాటి స్థానంలో పెడతామన్నారు. తనను హోటల్ లో ఉండనీయరని, ర్యాలీలు చేయనీయరని, కనీసం తన రాష్ట్రానికి వస్తానన్నా రానీయడం లేదని, ఇదెక్కడి న్యాయం అన్నారు పవన్.


నువ్వెంత, నీ బతుకెంత..?

సీఎం జగన్ పై కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు పవన్. నువ్వెంత..? నీ బతుకెంత..? నీ స్థాయి ఎంత..? అని ప్రశ్నించారు. జగన్ మానసిక పరిస్థితి బాగోలేదని చెప్పారు పవన్. మానసిక అనారోగ్యంతో బాధపడే వ్యక్తి చేతుల్లో ఏపీని పెట్టకూడదని, వైసీపీ వాళ్లు కూడా ఈ విషయంలో ఆలోచించాలని, ఆయనకు పిచ్చి ఉందని, ఆయన చేతిలో పార్టీని పెట్టొద్దని హెచ్చరించారు. జగన్.. గడాఫీ, సద్దాంహుస్సేన్ లాంటివాడన్నారు. రాష్ట్రంలో హింస ఎక్కువైందని, పీడన ఎక్కువైందని, దానికి చరమగీతం పాడాల్సిన సమయం వచ్చిందన్నారు. బీజేపీ, జనసేన మైత్రిని సద్వినియోగం చేసుకోలేకపోయామని అన్నారు పవన్. 2024 ఎన్నికల్లో జనసేన బలమైన శక్తిగా ఎదుగుతుందని, అసెంబ్లీలో బలమైన స్థానంలో ఉంటుందన్నారు. ఆ వ్యూహాలన్నీ తనకు వదిలేయాలన్నారు పవన్.

First Published:  16 Sept 2023 8:04 PM IST
Next Story