Telugu Global
Andhra Pradesh

పవన్ వర్సెస్ మిథున్ రెడ్డి.. మొదలైన యుద్ధం

"అధికారంలో ఉంది మీరే కదా..? పోలీసులు, వ్యవస్థలన్నీ మీ చేతిలోనే ఉన్నాయి కదా..? నిజాలు నిగ్గు తేల్చండి" అంటూ పపన్ కి సవాల్ విసిరారు మిథున్ రెడ్డి.

పవన్ వర్సెస్ మిథున్ రెడ్డి.. మొదలైన యుద్ధం
X

పిఠాపురంలో తనని ఓడించడానికి మిథున్ రెడ్డి నేరుగా రంగంలోకి దిగారని అప్పట్లో స్వయంగా పవన్ కల్యాణే ఆరోపించారు. ముద్రగడ పద్మనాభం వైసీపీ చేరిక విషయంలో కూడా మిథున్ రెడ్డి మంత్రాంగం నడిపిన విషయం అందరికీ తెలిసిందే. అప్పట్నుంచి మిథున్ రెడ్డిని ఆయన తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని.. తనకు రాజకీయ శత్రువులుగా భావిస్తున్నారు పవన్ కల్యాణ్. తాజాగా వారిద్దరూ ఎర్రచందనం స్మగ్లర్లంటూ జనసేనాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఎర్రచందనం గురించి పెట్టిన ప్రెస్ మీట్ కాదు, ఎర్రచందనం స్మగ్లింగ్ గురించి మాట్లాడాల్సిన సందర్భమూ కాదు, కానీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాత్రం మాజీ మంత్రి పెద్దిరెడ్డి, ఆయన తనయుడు మిథున్ రెడ్డిని పక్కా వ్యూహంతోనే సీన్ లోకి తీసుకొచ్చారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రం నుంచి ఎర్రచందనం స్మగ్లింగ్ చేసేవారని, లారీలను చెక్ పోస్ట్ ల వద్ద ఆపకుండా రాజకీయ పలుకుబడి ఉపయోగించేవారని.. ముఖ్యంగా పెద్దిరెడ్డి లారీలు, మిథున్ రెడ్డి లారీలు అని చెబితే ఎవరూ వాటిని టచ్ చేసేవారు కాదని అన్నారు పవన్. ఇటీవల అధికారులతో సమీక్ష చేస్తుండగా ఈ విషయాలన్నీ తనకు తెలిశాయన్నారాయన. కానీ నేపాల్ పోలీసులకు పెద్దిరెడ్డి అంటే ఎవరో తెలియదు కదా, అందుకే వాళ్లు ఈ లారీలను పట్టుకున్నారని చెప్పారు. వాటిని వెనక్కి తెప్పించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు డిప్యూటీ సీఎం పవన్.


పవన్ వ్యాఖ్యలకు ఎంపీ మిథున్ రెడ్డి ఘాటుగా బదులిచ్చారు. దీక్షలో ఉండి కూడా పవన్ కల్యాణ్ అలవోకగా అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. ఎంతకాలం తమపై ఇలా వ్యక్తిత్వ హననానికి పాల్పడతారని ప్రశ్నించారు. "అధికారంలో ఉంది మీరే కదా..? పోలీసులు, వ్యవస్థలన్నీ మీ చేతిలోనే ఉన్నాయి కదా..? నిజాలు నిగ్గు తేల్చండి" అంటూ సవాల్ విసిరారు. చివరకు లై డికెక్టర్ పరీక్షకైనా తాను సిద్ధమేనన్నారు మిథున్ రెడ్డి. పవన్ కల్యాణ్ చేసిన ఆరోపణలు నిరూపించాలని, లేకపోతే బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

First Published:  2 July 2024 2:03 AM GMT
Next Story