మళ్లీ ఏపీకి పవన్.. రాజమండ్రి, గుంటూరులో ఫైట్
వైసీపీ నేతలకు చెప్పు చూపి వార్నింగ్ ఇచ్చారు, ఇడుపులపాయ మీదుగా హైవే వేస్తానంటూ హెచ్చరించారు. ఇప్పుడు జగనన్న ఇళ్ల సోషల్ ఆడిట్ లో అంతకంటే ఘాటుగా ప్రభుత్వంపై విమర్శలు ఎక్కు పెట్టేందుకు పవన్ కల్యాణ్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.
ఆమధ్య విశాఖలో, ఆ తర్వాత ఇప్పటంలో ఏపీ ప్రభుత్వానికి వార్నింగ్ ఇస్తూ హడావిడి సృష్టించిన పవన్ కల్యాణ్, తాజాగా రాజమండ్రి, గుంటూరులో మరోసారి యుద్ధానికి సిద్ధమవుతున్నారు. జనసేన సోషల్ ఆడిట్ కార్యక్రమంలో భాగంగా పవన్ ఏపీలో పర్యటించబోతున్నారు. ఈనెల 12, 13, 14 తేదీల్లో జగనన్న ఇళ్లు, టిడ్కో ఇళ్లపై జనసేన సోషల్ ఆడిట్ చేపట్టబోతోంది. రాజమండ్రి, గుంటూరులో జరిగే ఆ కార్యక్రమంలో పవన్ పాల్గొంటారు.
పొలిటికల్ వార్ తప్పదా..?
వైసీపీ నేతలకు చెప్పు చూపి వార్నింగ్ ఇచ్చారు, ఇడుపుల పాయ మీదుగా హైవే వేస్తానంటూ హెచ్చరించారు. ఇప్పుడు జగనన్న ఇళ్ల సోషల్ ఆడిట్ లో అంతకంటే ఘాటుగా ప్రభుత్వంపై విమర్శలు ఎక్కు పెట్టేందుకు పవన్ కల్యాణ్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇటీవల టీడీపీకి తక్కువగా జనసేనకు ఎక్కువగా కౌంటర్లు ఇస్తున్నారు వైసీపీ నేతలు. అటు జనసేన నుంచి కూడా అదే స్థాయిలో సమాధానాలు వస్తున్నాయి. ఈ పొలిటికల్ డైలాగ్ వార్ ని కంటిన్యూ చేస్తూ ఇప్పుడు ఏపీలో జనసేనాని పర్యటన ఖరారైంది.
తాడోపేడో..
వైసీపీతో తాడోపేడో తేల్చుకోడానికి సిద్ధమయ్యారు పవన్ కల్యాణ్. దత్తపుత్రుడు అనే ముద్ర వేసినా, టీడీపీతో కలిసేందుకు ఏమాత్రం మొహమాటపడటంలేదు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వబోనని చెబుతున్న పవన్.. తాను సీఎం కాకపోయినా, జగన్ ని మాత్రం సీఎం కాకుండా చేయాలనే పట్టుదలతో పనిచేస్తున్నట్టుంది. అందుకే విమర్శలు ఎక్కువవుతున్నా పవన్ కూడా డోసు పెంచుతూ పోతున్నారు.
మోదీ అటు, పవన్ ఇటు..
ఈనెల 11న ప్రధాని నరేంద్రమోదీ విశాఖకు వస్తారు. మోదీ 12న తెలంగాణకు వెళ్తారు. 12వ తేదీ తెలంగాణ నుంచి పవన్ ఏపీకి వస్తారు. అంటే మోదీ ఇటునుంచి అటు వెళ్తే, ఆయన అటు నుంచి ఇటు వస్తారు. మోదీ పర్యటన మరుసటి రోజే ఏపీలో పవన్ పర్యటన ప్రారంభం కావడం విశేషం. జగనన్న కాలనీలు, టిడ్కో ఇళ్లు.. వచ్చే ఎన్నికలనాటికి ఈ గృహ సముదాయాలన్నీ వైసీపీకి ప్రధాన ఓటుబ్యాంకుగా ఉంటాయని ఆ పార్టీ అంచనా వేస్తోంది. ఈ దశలో తమ పథకాలను విమర్శిస్తూ దాడికి దిగుతున్న పవన్ పై వైసీపీ ఎదురుదాడి ఎలా ఉంటుందో వేచి చూడాలి.